Vijayawada West Bypass Road : విజయవాడ, రాజధాని ప్రాంతానికి కీలకమైన పశ్చిమ బైపాస్‌లో కొంతభాగం ఏప్రిల్ నెలలోపు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే సంక్రాంతి సమయంలో హైదరాబాద్-విజయవాడ హైవేలో వచ్చి ఏలూరు వైపు వెళ్లే వాహనాలను విజయవాడలోకి రాకుండా గొల్లపూడి నుంచి చిన్నఅవుటపల్లి మీదగా మళ్లించారు. తాజాగా గొల్లపూడి నుంచి కృష్ణానది మీదగా రాజధాని వైపు 7 కిలోమీటర్ల మేర రాకపోకలను ఏప్రిల్ నుంచి అనుమతించేందుకు కసరత్తు చేస్తున్నారు.
తద్వారా పశ్చిమ బైపాస్ ద్వారా ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి రాజధాని వైపు రాకపోకలు సాగించేందుకు దగ్గరిదారి అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిలో చిన్నఅవుటపల్లి-గొల్లపూడి-కాజ మధ్య విజయవాడ పశ్చిమబైపాస్ నిర్మాణం చేపట్టారు. ఇందులో చిన్నఅవుటపల్లి-గొల్లపూడి మధ్య 30 కిలోమీటర్లు దాదాపు పూర్తయింది. ఇప్పుడు గొల్లపూడి-కాజ ప్యాకేజీలో పాక్షికంగా 7 కిలోమీటర్లు అందుబాటులోకి తేనున్నారు.
Vijayawada Western Bypass Road Works : గొల్లపూడి శివారులో విజయవాడ-హైదరాబాద్ హైవే నుంచి కృష్ణానదిపై వంతెన దాటి వెంకటపాలెం, సీడ్ యాక్సెస్ రోడ్, పాలవాగు మీదుగా కొత్తగా నిర్మించే టోల్‌ప్లాజా దాటాక ఇ-8 (పెనుమాక-కృష్ణాయపాలెం-మందడం) రోడ్‌లో కలిసే వరకు బైపాస్ పనులు పూర్తిచేయనున్నారు. అంటే 3.12 కిలోమీటర్ల మేర వంతెన, మరో 4 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
దీనివల్ల హైదరాబాద్, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి సులువుగా రాజధాని ప్రాంతానికి రాకపోకలు సాగించవచ్చు. ప్రస్తుతం గొల్లపూడి, స్వాతి థియేటర్ సెంటర్, దుర్గమ్మ ఆలయం, ప్రకాశం బ్యారేజి, కరకట్ట మీదగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద నుంచి సీడ్ యాక్సెస్ రోడ్‌లోకి రాకపోకలు సాగిస్తున్నారు. ఇకపై నేరుగా గొల్లపూడి నుంచి కృష్ణానదిపై వంతెన మీదుగా ప్రయాణించి ఇ-8 రోడ్‌లోకి చేరుకోవచ్చు. దీనివల్ల దాదాపు 10 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
గొల్లపూడి-కాజ మధ్య 17.88 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారి ఈ ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రావాల్సి ఉంది. వైఎస్సార్సీపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఐదు గ్రిడ్ రోడ్ల వద్ద పైవంతెనలు లేకుండా నేరుగా బైపాస్ వెళ్లేలా నిర్మిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక గ్రిడ్ రోడ్ల వద్ద బైపాస్‌లో పైవంతెనలు నిర్మించాల్సిందేనని తెగేసి చెప్పింది. దీంతో మళ్లీ ఈ పనులు చేపట్టనున్నారు. ఇవన్నీ వచ్చే సంవత్సరం చివరకు గానీ పూర్తికావు. ఈలోపు పాక్షికంగా కొంతభాగం బైపాస్‌ను ఆరంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
స్పీడ్ యాక్సెస్ రోడ్ వద్ద క్లోవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్: కొన్నినెలల క్రితం సీఎం వద్ద సీఆర్‌డీఏ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో జరిగిన సమీక్షలో పశ్చిమ బైపాస్‌లో 5 గ్రిడ్ రోడ్ల వద్ద పైవంతెనలు, సీడ్ యాక్సెస్ రోడ్ వద్ద క్లోవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్ నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. తాజాగా కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో సీడ్ యాక్సెస్ రోడ్ వద్ద ఇంటర్‌ఛేంజ్ నిర్మాణం వద్దని సర్కార్ స్పష్టంచేసింది. దీనికి కొద్ది దూరంలోని ఇ-5 రోడ్‌లో క్లోవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్ నిర్మిస్తుండటంతో సీడ్ యాక్సెస్‌పై మళ్లీ అలాంటి నిర్మాణం వద్దని తెలిపింది.
అందుబాటులోకి చిలకలూరిపేట బైపాస్ - ఆరువరుసల రోడ్డుపై దూసుకెళ్లనున్న వాహనాలు