Jowar Upma Recipe in Telugu : ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా తమ డైలీ డైట్లో జొన్నలను భాగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా మంది జొన్నలతో రొట్టెలు, దోశలు ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ అవేకాకుండా ఈసారి కాస్త స్పెషల్‌గా "జొన్న ఉప్మాను" ట్రై చేయండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఉప్మా అంటే ఇష్టపడనివారు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికీ ఎంతో మేలు జరుగుతుంది. పైగా ఎవరైనా ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- జొన్నలు - 1 కప్పు
- నూనె - ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
- శనగపప్పు - 1 టీస్పూన్
- మినప్పప్పు - 1 టీస్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- వేయించుకున్న పల్లీలు - 2 టేబుల్‌స్పూన్లు
- ఎండుమిర్చి - 4
- ఇంగువ - చిటికెడు
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 3
- బీన్స్ తరుగు - అర కప్పు
- క్యారెట్ - 1
- ఉడకబెట్టిన పచ్చి బఠాణీ - పాపు కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావుటీస్పూన్
- కరివేపాకు - కొద్దిగా
- పచ్చికొబ్బరి తురుము - కొద్దిగా
బరువు, షుగర్‌ను కొట్టే ఫుడ్ ఇదే - "జొన్న దోశలు" ఇలా తయారు చేసుకోండి - టేస్ట్ వేరే లెవల్!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా జొన్నలను శుభ్రంగా కడిగి ఒక బౌల్లో 10 గంటలపాటు నానబెట్టుకోవాలి. అంటే.. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవాలనుకునేవారు రాత్రిపూట నానబెట్టుకుంటే సరిపోతుంది.
- ఇప్పుడు 10 గంటల పాటు నానబెట్టుకున్న జొన్నలను మరోసారి శుభ్రంగా కడిగి వాటర్ వడకట్టుకోవాలి.
- అనంతరం స్టౌపై కుక్కర్ పెట్టుకొని నానబెట్టుకున్న జొన్నలు వేసి తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఆపై మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక కుక్కర్ ఆవిరి మొత్తం తొలగించుకొని మూత తీసి ఉడికిన జొన్నలను స్టెయినర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా అదనపు నీరు ఉంటే తొలగిపోతుంది.
- జొన్నలు ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయనుసన్నని చీలికలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్‌ను సన్నని ముక్కలుగా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి.
- అవి వేగాక వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, ఇంగువ, సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ తరుగు వేసుకొని కలిపి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఉడికించిన పచ్చి బఠాణీ, ఉప్పు, పసుపు, కరివేపాకుయాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై ఉడికించి పక్కన పెట్టుకున్న జొన్నలు వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
- అనంతరం అరచెక్క నిమ్మరసం పిండి, కొబ్బరి తురుము, కొత్తిమీర తురుము వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా చక్కగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "జొన్న ఉప్మా" రెడీ!
- దీన్ని నేరుగా, లేదంటే ఏదైనా పచ్చడితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి!
బరువు తగ్గించే "జొన్న గుమ్మడికాయ సూప్" - ప్రిపరేషన్ చాలా ఈజీ! - బీపీ, షుగర్‌కూ చక్కటి మెడిసిన్!