Social Media Reels Effect on Children : నేటి జనరేషన్లో పిల్లలు, యువకులు మొబైల్ ఫోన్‌కు, అందులో సోషల్ మీడియా రీల్స్ కు ఎంత బానిసలుగా మారుతున్నారో తెలిసిందే. అక్కడక్కడా విస్తుపోయే ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అలాంటి ఓ ఆందోళనకర విషయమే ఇది. తమ పదేళ్లబాబు రీల్స్‌కు అలవాటు పడి వింత వింతగా మాట్లాడుతున్నాడంటూ ఓ తల్లి ఆందోళనకు గురవుతోంది. తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని నిపుణులను కోరుతోంది. మరి, ఆ సమస్యేంటో, ఆ బాబు ఏమంటున్నాడో, నిపుణులు ఎలాంటి సూచనలు చేశారో మీరూ తెలుసుకోండి.
"మా బాబుకు పది సంవత్సరాలు. కొన్ని నెలల కిందట చేయి విరిగింది. అప్పట్నుంచి ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం మానేశాడు. క్రమంగా ఇంట్లో ఫోన్‌కు అలవాటు పడి, నిత్యం రీల్స్ చూస్తూ ఉంటున్నాడు. ఈ మధ్య వింత వింతగా మాట్లాడుతున్నాడు. మీరు త్వరలో చనిపోతారు అంటున్నాడు. అదేవిధంగా "అడల్ట్ విషయాలు" మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ ఆందోళనగా కనిపిస్తున్నాడు. ఏం చేయాలో తెలియజేయండి" అంటూ ఆ బాలుడి తల్లి నిపుణులను సహాయం కోరింది. అందుకు ప్రముఖ మానసిక నిపుణురాలు మండాది గౌరీదేవి ఈ విధంగా సూచించారు.
"పదేళ్ల పిల్లల్లో ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. తమ చుట్టూ జరిగే విషయాలన్నీ తెలుసుకోవాలనే తపనతో ఉంటారు. అయితే, ఇప్పటి పిల్లలకు ఫోన్, టీవీ ద్వారా ఎంతో సమాచారం వాళ్ల ముందు కనిపిస్తోంది. రీల్స్, విదేశీ కంటెంట్ వంటివి వాళ్లను బాగా ఆకర్షిస్తున్నాయి. అవన్నీ నిజమేనని వాళ్లు నమ్ముతుంటారు. మీ బాబు చేతికి దెబ్బతగిలి ఇంట్లోనే ఉండడం వల్ల అతను రీల్స్ వైపు మళ్లాడు. అవి ఒక్క క్లిక్ దూరంలోనే ఉన్నాయి.
ఈ రీల్స్‌లో ప్రేమ, అనుబంధం, శృంగారం, జీవితం, హత్యలు, ఇతరత్రా క్రైమ్ వంటివి లక్షలాది వీడియోల రూపంలో చేతిలో కనిపిస్తోంది. ఇవన్నీ పిల్లల్లో గందరగోళాన్ని పెంచుతాయి. ఇందులో ఏది ఒప్పో, ఏది తప్పో, ఏది అబద్ధమో, ఏది నిజమో తెలుసుకోలేని స్థితిలో పిల్లలు పడిపోతున్నారు. వాటిని చూసిన మీ బాబు, తన జీవితంలోనూ అలాగే జరుగుతుందని భావిస్తున్నాడు, భయపడుతున్నాడు. ఆ కారణంగానే వింత ప్రశ్నలు అడుగుతూ, ఆందోళన చెందుతున్నాడు.
అందువల్ల మీ బాబును వెంటనే సైకియాట్రిస్టు దగ్గరికి తీసుకెళ్లండి. ఎందుకంటే, ఇంట్లో మీరు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. మానసిక నిపుణులు అతని ఆలోచనా దృకృథాన్ని అంచనా వేసి, అతని పరిస్థితిని పరిశీలిస్తారు. దినచర్యను మార్చడం ద్వారా భయాందోళనలు తగ్గించే టెక్నిక్స్ నేర్పిస్తారు. దీన్ని "డీ సెన్సిటైజేషన్" అంటారు. అవసరమైతే మెడిసిన్ రాస్తారు. దీంతోపాటు మీ బాబుకు నచ్చిన ఆటలు, స్ఫూర్తిదాయక కెరియర్ వీడియోలు చూపించండి. కథల పుస్తకాలు చదివేలా ప్రోత్సహించండి. త్వరగానే మార్పు వస్తుంది." అని ప్రముఖ మానసిక నిపుణురాలు మండాది గౌరీదేవి సూచించారు.
ఇవి కూడా చదవండి :
మీ పిల్లలు స్మార్ట్ఫోన్లకు బందీ అవుతున్నారా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే బెటర్
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్! ఆ దేశం కీలక నిర్ణయం!!