Tricks and Tips Session on Maths And Hindi Subjects : పరీక్షల సమయంలో భయం వీడి సాధన చేస్తే మంచి మార్కులు సాధించవచ్చని చెబుతున్నారు విషయ నిపుణులు. 'ఈటీవీ భారత్' ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతోపాటు బాలక్‌మందిర్ ఉర్దూ మాధ్యమ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. సదస్సుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.సుధాకర్ అధ్యక్షత వహించగా విషయ నిపుణులు కుంట మహేందర్ రెడ్డి, వై. వినాయక్‌లు గణితం, హిందీ సబ్జెక్టులపై విద్యార్థులకు మెలకువలు తెలిపారు. అధిక మార్కులు రావాంటే వేటిపై దృష్టి సారించాలి? విద్యార్థులు కనీస మార్కులతో ఎలా గట్టేక్కాలో చిట్కాలు చెప్పారు.
విశ్లేషణ చేస్తూ సాధన చేయాలి : గణితం అంటే విద్యార్థులు భయపడతారు. ఏదైనా విషయం ఇష్టంతో చదివితే మంచిమార్కులు సాధించవచ్చని అంటున్నారు గణిత విషయ నిపుణులు కుంట మహేందర్‌రెడ్డి. గణితంలో పాత ప్రశ్నపత్రాల విశ్లేషణ చేస్తూ సాధన చేయాలి అని సూచించారు. అన్ని అధ్యాయాల నుంచి ప్రశ్నలు అడుగుతారని, 80కి 80 మార్కులు రావాలంటే అన్నింటిపై అవగాహన అవసరమని తెలిపారు.
- ఏ భావనను వదలకుండా పుస్తకంలోని అన్ని రకాల సమస్యలను అభ్యాసం చేయాలి.
- ముఖ్యంగా పార్ట్-బి కోసం ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు కేటాయించాలి.
- అనుసంధానం విద్యా ప్రమాణం కలిగిన సమస్యలు కొంత కఠినంగా ఉంటాయి. వాటికి కచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి.
- బహుపదులలో గ్రాఫ్ సమస్యలు, సరూప త్రిభుజాలు అధ్యాయంలో నిర్మాణాలు, సాంఖ్యక శాస్త్రంలో వర్గీకృత దత్తాంశ సగటు, మధ్యగతము, బహుళకం కొనుగొనుట, సంభావ్యత, సమితులు, శ్రేఢులు వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
- ఎట్టి పరిస్థితుల్లో కొట్టివేతలు ఉండకూడదు. అలా రాసేలా చూసుకోవాలి.
చెరో అయిదు పద్య, గద్య భాగాలు చదివితే చాలు : హిందీ అనగానే ఎలాగూ ఉత్తీర్ణులవుతామనే ధీమాతో విద్యార్థులు కొందరు పొరపాట్లు చేసి అనుత్తీర్ణులవుతారు. నిర్లక్ష్యం చేయకుండా అయిదు పద్యభాగ పాఠాలు, మరో అయిదు గద్యభాగ పాఠాలు చదివితే అధిక మార్కులు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు హిందీ విషయ నిపుణులు వై.వినాయక్. ఎన్ని వాక్యాలు రాశామన్నది కాకుండా అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం రాయగలిగితే మార్కులు పొందవచ్చని అంటున్నారు. ఇచ్చిన వ్యాసం చదివి ప్రశ్నలకు ఆలోచించి సమాధానాలు రాయాలని తెలిపారు. పరీక్ష సయమాన్ని గమనిస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాసినప్పుడే మంచిమార్కులు సాధించవచ్చని సూచించారు.
- అయిదు కవి, ఏడు లేఖక్ పరిచయాలు కచ్చితంగా దవాలి
- అయిదు గద్య, మరో అయిదు పద్యభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి
- సామాజిక, పర్యావరణ, సాంస్కృతిక అంశాల వ్యాస రచనలు చదివి రాయాలి.
- దరఖాస్తులు, ఫిర్యాదులు, ఆహ్వానాలతో కూడిన లేఖలు రాయడం నేర్చుకోవాలి.
- శీర్షికలు, ఉపశీర్షికలు, పేరాలతో సమాధానాలు రాయాలి.
- పర్యాయ, వ్యతిరేక పదాలు సాధన చేయాలి.
పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే - ఎలా రాయాలో మీకు తెలుసా?
పదో తరగతి పరీక్షల కీలక అప్‌డేట్ - ప్రీ ఫైనల్‌లో ఓఎంఆర్ షీట్