Raw Tomato Pachadi in Telugu : తెలుగువారి భోజనంలో ఎన్ని రకాల కూరలు ఉన్నా సైడ్‌డిష్‌గా ఏదైనా పచ్చడి కంపల్సరీ. ఈ క్రమంలోనే చాలా మంది ఇష్టంగా తినే పచ్చళ్లలో టమాటా పచ్చడి ముందు వరుసలో ఉంటుంది. దీన్ని రకరకాల వెరైటీలలో ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడైనా పచ్చి టమాటాలతో పచ్చడిని ట్రై చేశారా? లేదు అంటే మాత్రం ఓసారి తప్పక టేస్ట్ చేయాల్సిందే. చాలా అద్భుతమైన రుచితో వహ్వా అనిపిస్తోంది ఈ పచ్చడి. అంతేకాదు, ఎప్పుడూ టమాటా చట్నీ చేసుకున్నా ఇదే స్టైల్‌ని ఫాలో అవుతారు. మరి, ఈ సూపర్ టేస్టీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పచ్చి టమాటాలు - అరకిలో
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- ఎండుమిర్చి - 5
- పచ్చిమిర్చి - 5
- కొత్తిమీర - గుప్పెడు
- చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
- జీలకర్ర - 1 టీస్పూన్
- ధనియాలు - 1 టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 10
- పసుపు - పావుటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం :
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- పోపు దినుసులు - 2 టేబుల్‌స్పూన్లు
- ఇంగువ - చిటికెడు
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు - 1 రెమ్మ
టమాటాలు ఉడకబెట్టకుండా నిమిషాల్లో అద్దిరిపోయే పచ్చడి - అన్నం, టిఫెన్స్లోకి సూపర్ కాంబో!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా పచ్చి టమాటాలను శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కాక ఎండుమిర్చి, మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త వేగాక కొత్తిమీరను కూడా వేసుకొని కాసేపు వేయించాలి.
- ఆ మిశ్రమం చక్కగా వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటా ముక్కలు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత మూతపెట్టి స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకునేటప్పుడు మధ్యమధ్యలో మూతతీసి కలుపుకోవాలి. ఇలా చేయడం ద్వారా టమాటా ముక్కలు అన్ని వైపులా చక్కగా వేగుతాయి. అందుకోసం 10 నిమిషాల వరకు టైమ్ పట్టొచ్చు.
- పచ్చి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో చింతపండు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
- ఆపై మంటను సిమ్‌లో ఉంచి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే పసుపు వేసుకోవాలి.
- అలా వేయించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని కాస్త చల్లార్చుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన టమాటా మిశ్రమం, ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా రోట్లో దంచుకున్నట్లు కచ్చాపచ్చాగా ఉండేట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఆపై పచ్చడిని ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కనుంచాలి.
- అనంతరం తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక పోపు దినుసులు(జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు), ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి.
- పోపు చక్కగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, నోరూరించే కమ్మని "పచ్చి టమాటా పచ్చడి" రెడీ!
పదే పది నిమిషాల్లో - పసందైన "పచ్చికొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి" - టేస్ట్ వేరే లెవల్ అంతే!