IRCTC Mystical Kashmir Winter SpecialEx Hyderabad Tour:ఉత్తర భారతదేశంలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో కశ్మీర్ ఒకటి. చుట్టూ మంచు పర్వతాలు.. ఎత్తైన కొండలు.. వాటి మధ్యలో రోప్ జర్నీ.. ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించలేము. మరి మీరు కూడా ఆ ఫీలింగ్‌ను పొందాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఇండియన్ ర్వైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. మరి టూర్ ప్రయాణం ఎన్ని రోజులు? ధర ఎంత? ఏయే ప్రదేశాలు కవర్ అవుతాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
"మిస్టికల్ కశ్మీర్ వింటర్ స్పెషల్ ఎక్స్ హైదరాబాద్" పేరిట ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి విమానం ప్రయాణం ద్వారా ఈ టూర్ మొదలవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. ఈ టూర్లో భాగంగా గుల్మార్గ్, పహల్గామ్, సోన్మార్గ్, శ్రీనగర్‌లోని పలు ప్రదేశాలు విజిట్ చేస్తారు. మరి ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటిరోజు మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ (6E- 6253) జర్నీ స్టార్ట్ అవుతుంది. సాయంత్రానికి శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్ చేసుకుని.. ముందుగానే బుక్ చేసిన హోటల్‌కి తీసుకెళ్తారు. అక్కడ చెకిన్ అయ్యి తర్వాత ఆ సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. ఆ రాత్రికి శ్రీనగర్‌లో డిన్నర్, స్టే ఉంటుంది.
- రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బంగారు గడ్డి మైదానంగా పేరొందిన సోన్‌మార్గ్‌కు వెళ్తారు. అక్కడ మంచుతో కప్పిన ఎత్తయిన కొండలు, మంచుతో కప్పిన రోడ్లను చూసి మైమరిచిపోవచ్చు. ఈ పర్యటనలో తాజ్వాస్ గ్లేసియర్ (హిమానీనదం) ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. వీటిని చూసిన తర్వాత శ్రీనగర్‌కు వచ్చి హోటల్లో స్టే చేస్తారు.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఉదయం గుల్మార్గ్కు బయల్దేరుతారు. అక్కడ పూలతో నిండిన రోడ్ల మార్గం ద్వారా ప్రయాణించి గుల్మార్గ్ గోండోలాకు చేరుతారు. అక్కడ రోప్‌వే ప్రయాణం మైమరిపిస్తుంది. దానికి ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుంది. అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి శ్రీనగర్‌కు చేరుకుని ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు.
- నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పహల్గామ్కు ప్రయాణం ఉంటుంది. సముద్ర తీరానికి 2440 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ఉండే లోయ అందాలను వీక్షించాక.. తిరుగు ప్రయాణంలో కుంకుమపువ్వు పంట అందాలు, అవంతిపూర్ శిథిలాలు వీక్షించొచ్చు. ఆ రోజు రాత్రి పహల్గామ్ హోటల్లోనే భోజనం చేసి అక్కడే స్టే చేస్తారు.
- ఐదో రోజు టిఫెన్ తర్వాత శ్రీనగర్‌కు చేరుకుంటారు. అక్కడ ఆదిశంకరాచార్య మందిరాన్ని దర్శించుకుంటారు. ఆ సాయంత్రం సూర్యాస్తమయాన్ని వీక్షించటానికి సాయంత్రం దాల్ సరస్సుకు తీసుకెళ్తారు. అక్కడున్న చార్-చినార్ (ప్లోటింగ్ గార్డెన్స్) వీక్షించొచ్చు. అయితే ఇక్కడ రుసుములు యాత్రికులే చెల్లించాలి. అనంతరం హౌస్‌బోట్‌లోకి చెకిన్ అయ్యాక ఆ రాత్రికి అక్కడే బస ఉంటుంది.
- ఆరో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హౌస్‌బోట్ నుంచి చెక్ అవుట్ అయ్యి మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్ విజిట్ చేస్తారు. అక్కడి నుంచి శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. ఆ సాయంత్రానికి శ్రీనగర్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజ్ ఛార్జీలు..
- కంఫర్ట్‌లో సింగిల్ షేరింగ్ కావాలంటే ఒక్కొక్కరికీ రూ.43,670 చెల్లించాలి. ట్విన్ షేరింగ్ అయితే రూ.41,710, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.41,050 పే చేయాలి.
- 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్ బెడ్ అయితే రూ.37,130, విత్ అవుట్ బెడ్ అయితే రూ.34,830 పే చేయాలి. 2 నుంచి 4 సంవత్సరాల చిన్నారులకు రూ.27,990 చెల్లించాలి.