Cleaning Tips with Baking Soda :సాధారణంగా బేకింగ్ సోడా చాలా మంది వంటింట్లో ఉంటుంది. ఏవైనా పిండి వంటకాలు చేస్తున్నప్పుడు, అలాగే కేక్‌ల రుచి పెంచడానికి కచ్చితంగా కాస్త బేకింగ్ సోడా ఉపయోగిస్తుంటారు. దీనిని సోడియం బైకార్బోనేట్.. ఇంకా వంటసోడా అని కూడా పిలుస్తారు. అయితే.. ఈ బేకింగ్ సోడాను వంటల్లోనే కాకుండా కిచెన్, బాత్రూమ్లోని టైల్స్, ఇంట్లోని స్టెయిన్లెస్ స్టీల్ ట్యాప్స్ క్లీన్ చేయడానికీ ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బేకింగ్ సోడాతో వీటిని ఎలా శుభ్రం చేయాలో మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం.
కిచెన్‌లోని మరకలను ఇలా మాయం చేయండి..
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా.. రోజూ వంట చేసే క్రమంలో వంటగది ప్లాట్‌ఫామ్, స్టౌ, కిచెన్‌లోని టైల్స్‌పై నూనె మరకలు పడుతుంటాయి. అయితే, బేకింగ్ సోడాతో ఈ మరకలని ఈజీగా మాయం చేసుకోవచ్చు. ముందుగా గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా, నిమ్మరసం, నీళ్లు పోసుకుని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని కిచెన్‌లో మరకలున్న చోట చల్లండి. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా తుడవండి. ఇలా చేస్తే వంటగదిలోని ఆయిల్ మరకలు పోయి.. కిచెన్ తళతళా మెరుస్తుంది.
బాత్రూమ్లోని టైల్స్ కొత్తవాటిలా..
సాధారణంగా బాత్రూమ్లోని ఫ్లోర్, టైల్స్‌పై ఏర్పడిన మొండి మరకలు ఓ పట్టాన వదలవు. అయితే, ఒక్కసారి బేకింగ్ సోడాని ఇలా ఉపయోగిస్తే.. బాత్రూమ్లోని టైల్స్ కొత్తవాటిలా తళతళా మెరిసిపోతాయి. ముందుగా టైల్స్‌పై బేకింగ్ సోడాని చల్లండి. తర్వాత కొన్ని నీళ్లు చల్లుతూ.. బ్రష్‌తో టైల్స్‌ని రుద్దండి. ఇప్పుడు వాటర్‌తో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు బేకింగ్ సోడాతో పాటు వెనిగర్ లేదా నిమ్మరసం కూడా ఉపయోగించవచ్చు.
స్టెయిల్‌లెస్ స్టీల్ ట్యాప్స్..
ప్రస్తుత కాలంలో చాలా మంది బాత్రూమ్, కిచెన్లలో స్టెయిల్‌లెస్ స్టీల్ ట్యాప్స్ ఫిక్స్ చేయించుకుంటున్నారు. అయితే, కొన్ని రోజుల తర్వాత వీటిపై మురికి, ఉప్పు మరకలు పేరుకుపోయి చూడడానికి అందవిహీనంగా కనిపిస్తాయి. బేకింగ్ సోడాతో చకచకా వీటిని కొత్త వాటిలా మెరిపించవచ్చు. ముందుగా గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని వాటర్ కలిపి పేస్ట్‌లాగా చేయండి. ఈ మిశ్రమాన్ని ట్యాప్‌కి పట్టించి అరగంట సేపు నాననివ్వండి. తర్వాత టూత్‌బ్రష్‌తో ట్యాప్‌పైన రుద్ది.. నీటితో క్లీన్ చేయండి. అంతే ట్యాప్ మెరిసిపోతుంది.