How to Store Rice in Telugu :చాలా మంది ఇళ్లలో ఆరు నెలలు లేదా సంవత్సరానికి సరిపడా బియ్యం నిల్వ ఉంచుకుంటారు. మంచి నాణ్యమైన బియ్యం కోసం వేల రూపాయలు ఖర్చుపెడతారు. కానీ, కొన్నాళ్ల తర్వాత బియ్యంలో లక్క పురుగు, నల్లటి పురుగులు పడుతుంటాయి. ఈ పురుగులను పూర్తిగా తొలగించడం అంత సులభం కాదు. పల్లెల్లో ఉన్నవారైతే చేటలతో చెరిగి బియ్యానికి పట్టిన పురుగును తొలగించుకుంటారు. పట్నాల్లో ఉన్నవారికి అంత సమయం ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో బియ్యానికి పురుగుపట్టకుండా ఉండడానికి కొన్ని చిట్కాలుపాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ రోజుల పాటు బియ్యం పురుగు పట్టకుండా ఉండడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఇంగువ :వంటల్లో విరివిగా ఉపయోగించే ఇంగువతో బియ్యంలో పురుగులు చేరకుండా చేయవచ్చు. ఇంగువ వెదజల్లే ఘాటైన వాసన కారణంగా బియ్యానికి పురుగులు పట్టవు. బియ్యం కొన్న తర్వాత రైస్ బ్యాగ్‌ని తెరచి కొద్దిగా ఇంగువ కలపండి. ఇంగువ బియ్యంలో పురుగులతో పాటు, తేమ వల్ల పెరిగే బ్యాక్టీరియాను సైతం సంహరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వేపాకులు :బియ్యం నిల్వ చేయడానికి చాలా మంది వేపాకులను ఉపయోగిస్తారు. దీనిలో ఉండే క్రిమిసంహారక గుణాలు బియ్యంలో పురుగులు చేరకుండా కాపాడతాయి. దీనికోసం ముందుగా కొన్ని వేపాకులను తీసుకొని బాగా ఎండబెట్టుకొని మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. దీన్ని ఓ క్లాత్‌లో చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం మధ్యలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల బియ్యంలో తెల్లపురుగులతో పాటు పెంకు పురుగులు కూడా పట్టకుండా ఉంటాయి.
కర్పూరం :కర్పూరం వెదజల్లే ఘాటైన సువాసన వల్ల బియ్యంలో పురుగులు, బ్యాక్టీరియా పెరగవు. ఇందుకోసం ముందుగా పది కర్పూరం బిళ్లలను తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి. దీన్ని కాస్త మందంగా ఉండే నూలు వస్త్రంలో చుట్టి బియ్యం డబ్బాలో పెట్టాలి. అంతే ఎక్కువ రోజులు బియ్యం తాజాగాఉంటాయి.