How to Store Ginger Garlic Paste for Long Time: అల్లం, వెల్లుల్లి.. వంటగదిలో వీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే.. మనం రోజూ చేసుకొనే కూరలు, నాన్‌వెజ్ వంటకాల్లో ఈ పేస్ట్ వేయనిదే వాటి తయారీ పూర్తి కాదు. వంటకాలకు రుచిని అందించడంలో దీని తర్వాతే ఏదైనా. అలాగని రోజూ దీన్ని తయారుచేసుకోవడం పెద్ద పని. అందుకే ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటుంటారు చాలామంది మహిళలు. ఈ క్రమంలోనే ఇది పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- తేమ తగిలితే ఏ పదార్థమైనా త్వరగా పాడైపోతుంది. అల్లం-వెల్లుల్లి పేస్ట్ దీనికి మినహాయింపు కాదు. అందుకే దీని తయారీలో వాడే అల్లం ముక్కలు, వెల్లుల్లిని శుభ్రం చేసినా.. తేమ లేకుండా పొడిగా తుడిచాకే మిక్సీ పట్టుకోవాలి. తద్వారా ఇది ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
- అల్లం వెల్లుల్ని పేస్ట్ తయారుచేసుకున్నాక.. ఈ మిశ్రమానికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు లేదా పల్లీ లేదా ఆలివ్ నూనె, టీస్పూన్ ఉప్పు కలిపి.. గాలి చొరబడని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇవి సహజ సిద్ధమైన ప్రిజర్వేటివ్స్‌లా పనిచేసి.. అల్లం-వెల్లుల్ని పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తాయి.
- అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ని గాలి చొరబడని జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచినా ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. అయితే దీనికి ఎలాంటి రంధ్రాలు, లీకేజీలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
- కొన్నిసార్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పై-పొర ఆకుపచ్చ లేదా పసుపు రంగులోకి మారడం జరుగుతుంటుంది. ఇలా రంగు మారడం కూడా అది పాడవుతుందనడానికి ఓ సంకేతమే అంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలా జరగకుండా ఈ పేస్ట్‌లో టీస్పూన్ నిమ్మరసం వేసి కలిపి.. గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
మార్కెట్ నెయ్యితో కల్తీ భయమా? - పాల మీగడతో స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోండిలా!
- క్లింగ్ ఫిల్మ్, పార్చ్‌మెంట్ పేపర్.. వీటికి బయటి వాతావరణంలోని తేమ, జిడ్డుదనాన్ని ఆపే లక్షణాలుంటాయి. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకొని.. ఆ జార్‌ను క్లింగ్ ఫిల్మ్/పార్చ్‌మెంట్ పేపర్‌తో క్లోజ్ చేయాలి. ఇది కూడా ఈ పేస్ట్ ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు దోహదం చేస్తుంది. మార్కెట్లో మనం కొనే చాలా ఉత్పత్తులకూ క్లింగ్ ఫిల్మ్/పార్చ్‌మెంట్ పేపర్‌తో సీల్ చేసి రావడం మనం చూస్తుంటాం. ఆయా పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉండడానికే ఇలా ప్యాక్ చేస్తుంటారని నిపుణులు అంటున్నారు.
- అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి. వీటిని ఫాయిల్ పేపర్/ఐస్‌క్యూబ్ ట్రేలో పెట్టి కొన్ని గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. దీంతో ఈ బాల్స్ గడ్డకట్టుకుపోతాయి. ఇప్పుడు వీటిని గాలి చొరబడని జిప్‌లాక్ బ్యాగ్‌లో వేసి.. ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రీజ్ అయిన ఈ బాల్స్ కనీసం మూడు నెలల పాటు నిల్వ ఉంటాయని అంటున్నారు. కావాలనుకున్నప్పుడు ఒక బాల్ తీసుకొని నేరుగా వంటకాల్లో వేసేసుకుంటే సరిపోతుందట.
- నిల్వ చేయాలనుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని బేకింగ్ షీట్‌పై పరిచి.. 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కాసేపు అవెన్‌లో పెట్టాలి. దీనివల్ల అందులో ఉండే తేమ ఆవిరైపోతుంది. ఇప్పుడు దీన్ని గాలి చొరబడని సీసాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా డీ హైడ్రేట్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందని నిపుణులు అంటున్నారు.