How To Prepare Mysore Tomato Rasam :చాలా మందికి భోజనంలోకి ఎన్ని కూరలు, వేపుళ్లు ఉన్నా.. కాస్త రసంతో తింటేనే తృప్తిగా ఉంటుంది. అందుకే టమాటా రసం, మిరియాల రసం వంటివి చేసుకుంటారు. అయితే, టమాటా రసంలో కూడా చాలా రకాలున్నాయి. దీనిని ఒక్కోచోట ఒక్కో టేస్ట్‌తో ప్రిపేర్ చేస్తుంటారు. కాబట్టి ఈసారి మీ ఇంట్లో టమాటా రసం చేయాలనుకుంటే.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా మైసూర్ స్టైల్లో చేసేయండి. ఈ రసం చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. పైగా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఎలా చేయాలో ఓ లుక్కేయండి!
కావాల్సిన పదార్థాలు :
- కందిపప్పు- నాలుగు టేబుల్ స్పూన్లు
- చింతపండు- నిమ్మకాయసైజంత
- టమాటాలు -4
- పచ్చిమిర్చి - 4
- బెల్లం- టేబుల్‌స్పూన్
- కరివేపాకు
- పసుపు - చిటికెడు
- నూనె
- ఉప్పు- రుచికి సరిపడా
- కొద్దిగా కొత్తిమీర తరుగు
రసం పొడి కోసం..
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- పచ్చి శనగపప్పు- టేబుల్‌స్పూన్
- పచ్చికొబ్బరి- పావుకప్పు
- మిరియాలు- టీస్పూన్
- బ్యాడిగి మిర్చి-3
- ధనియాలు- టేబుల్‌స్పూన్
- జీలకర్ర- అర టీస్పూన్
తాళింపు కోసం..
- జీలకర్ర-టీస్పూన్
- నెయ్యి-టేబుల్‌స్పూన్
- ఆవాలు-టీస్పూన్
- ఎండుమిర్చి-2
- ఇంగువ- అరటీస్పూన్
టమాటా రసం తయారీ విధానం :
- ముందుగా కందిపప్పును రెండుసార్లు శుభ్రంగా కడిగి.. అరగంటపాటు నీటిలో నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత కుక్కర్లో కందిపప్పు వేసుకుని నీళ్లు పోసుకుని సన్నని మంటమీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. పప్పు ఉడికిన తర్వాత మూత తీసి మెత్తగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- అలాగే మరొక స్టౌపై పాన్ పెట్టి ఆయిల్ పోసి బ్యాడిగి మిర్చి, పచ్చి శనగపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి.
- ఇందులోనే పచ్చికొబ్బరి వేసి సన్నని మంట మీద మంచి అరోమా వచ్చేవరకు ఫ్రై చేసుకోండి. మీకు అచ్చం మైసూర్ స్టైల్ రసం రుచి రావాలంటే కచ్చితంగా బ్యాడిగి మిర్చి వాడాలి. ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. మీ దగ్గర బ్యాడిగి మిర్చి లేకపోతే ఎండు మిర్చిలను వాడుకోవచ్చు.
- ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పడు ఓ గిన్నెలో తీసుకుని అందులోకి కట్ చేసిన టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు, బెల్లం, పసుపు వేసుకుని.. మెత్తగా చిదుముకోవాలి. అంటే టమాటాలలోని సారం మొత్తం వచ్చేంత వరకు చేతితోనే మెదుపుకోవాలి.
- అలాగే ఇందులోకి చింత పండు, కరివేపాకులు వేసుకుని మరొక సారి మెదుపుకోవాలి.
- ఇప్పుడు ఆ టమాటా రసాన్ని ఓ పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇందులో లీటర్ వాటర్ పోయండి. అలాగే పచ్చిమిర్చిలు వేసి సన్నని మంట మీద రసం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి.
- మరుగుతున్న టమాటా రసంలో ఉడికించిన పప్పు, గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి, కొత్తిమీర తరుగు వేసి హై ఫ్లేమ్ మీద మరో నాలుగు నిమిషాలు మరిగించాలి. తర్వాత సన్నని మంట మీద రసాన్ని మరిగించుకోవాలి.
- మరోపక్క తాళింపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
- ఇప్పుడు తాళింపును మరుగుతున్న రసంలో వేసి మరో పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే.. అంతే ఘుమఘుమలాడే మైసూర్ రసం రెడీ.
- ఒక్కసారి ఈ మైసూర్ స్టైల్ రసంతో తిన్నారంటే.. రెండు ముద్దలు ఎక్కువే తింటారు. నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ రసం ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
వర్షాకాలంలో "పచ్చి పులుసు" ఇలా చేస్తే - టేస్ట్ గురించి చెప్పడం కాదు, ఆస్వాదించాల్సిందే!
సూపర్ టేస్టీ : 10 నిమిషాల్లో టమాటా మిరియాల రసం - ఇలా ప్రిపేర్ చేస్తే ఒట్టి రసం కూడా తాగేస్తారు!