Easy Ways to Organize Wardrobe:ప్రస్తుతం ప్రతి ఇంటిలో వార్డ్‌రోబ్ కచ్చితమైంది. ఎందుకంటే దుస్తులను బయట పెట్టడం కన్నా.. ఇందులో పెడితే నీట్‌గా ఉండటంతో పాటు వాటిపైన దుమ్ము, ధూళి పడకుండా ఉంటాయి. అందుకే చాలా మంది ఇంటిని నిర్మించే క్రమంలో వీటికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే నేటి బిజీ లైఫ్‌లో ఆఫీసుకు వెళ్లే హడావిడిలో వార్డ్‌రోబ్‌లో చేతికందిన డ్రస్సు తీసుకుని ధరించడం, తిరిగి వాటిని ఉతికిన తర్వాత మడతపెట్టకుండానే అందులో పడేయడం.. చాలామందికి అలవాటే. అయితే ఇది మొదట్లో బాగానే ఉన్నా.. కొన్ని రోజుల తర్వాత అల్మరా అంతా చిందరవందరగా మారిపోతుంది. దాంతో ఏ టాప్ ఎక్కడుందో, ఏ లెగ్గింగ్ ఎక్కడుందో అర్థం కాక దానిని వెతుక్కోవడానికి మరింత సమయం వృథా అవుతుంది. ఇంకొంతమందైతే ఉపయోగించని దుస్తుల్ని కూడా అందులోనే పడేస్తుంటారు. మరి, ఇలా కాకుండా ఉపయోగించే దుస్తులతోనే వార్డ్‌రోబ్‌ని పొందికగా సర్దుకోవాలంటే ఈ చిన్నపాటి టిప్స్ పాటిస్తే సరి అంటున్నారు నిపుణులు. మరి అవేంటంటే..
వేటికవే అమర్చండి:కొంతమంది డ్రస్సులు, చీరలు, జీన్సులు.. ఇలా అన్నీ ఒకే చోట పెడుతుంటారు. దీంతో వెతికేటప్పుడు ఒక్కటీ సరిగ్గా దొరకదు. అందుకే మడతపెట్టేటప్పుడే వేటికవే జతగా ఉంచి.. వాటిని విడివిడిగా వార్డ్‌రోబ్‌లో అమర్చాల్సి ఉంటుంది. అంటే.. చీరలన్నీ ఒక వరుసలో అమర్చుకోవచ్చు.. ఇక దానికి మ్యాచింగ్ బ్లౌజ్, పెటీకోట్స్.. వంటివి ఆ పక్కనే మరో వరుసలో పెట్టుకోవచ్చు.. లేదంటే చీరలోనే దానికి సంబంధించిన బ్లౌజ్, పెటీకోట్స్‌ని పెట్టి.. ఆ మొత్తాన్ని వార్డ్‌రోబ్‌లో సర్దుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సులభంగా దొరుకుతాయి. ఇతర డ్రస్సులు, జీన్స్-టాప్స్.. వంటివాటినీ ఇలానే సర్దుకోవాలి. అలాగే రోజూ ఉపయోగించే దుస్తులు ముందు వరుసలో పెట్టి .. ఎప్పుడో అరుదుగా ఉపయోగించే వాటిని వెనకవైపు అమర్చుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
వారికి సపరేట్: ఇంట్లో ఉన్న సభ్యులందరి దుస్తులూ ఒకే అల్మరాలో.. అది కూడా ఒకే షెల్ఫ్‌లో అమర్చే వారూ ఉన్నారూ. దీనివల్ల మీరెంత నీట్‌గా సర్దినా.. ఎదుటివారు చిందరవందరగా పడేసే అవకాశముంది.. పైగా ఇలా అందరి దుస్తులూ ఒకే ర్యాక్‌లో పెడితే అంత సులభంగా దొరకవు కూడా. కాబట్టి ఎవరు వేసుకునే దుస్తులు వారికి అందుబాటులో ఉండేలా వేర్వేరు అల్మారాలో పెట్టాలి. ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దలు పదే పదే అల్మరాను చిందరవందరగా పడేస్తే.. వాటిని సర్దడానికి మీకు సమయం ఉండకపోవచ్చు. అందుకే వార్డ్‌రోబ్‌లో ఎవరి షెల్ఫ్‌ను వారు నీట్‌గా ఉంచుకోవాలన్న విషయం వారికి చెప్పి.. ముందునుంచే వారితో ఈ అలవాటు చేయించాలి.
వాషింగ్ మెషీన్లో బట్టలకు గంజి పెట్టొచ్చని మీకు తెలుసా? - ప్రాసెస్ వెరీ ఈజీ - ఇప్పుడే తెలుసుకోండి!