How to Make Ridge Gourd Rice Soup: నేటి రోజుల్లో చాలా మంది అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నారు. బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో డైటింగ్ ఒకటి. అయితే ఇలా డైటింగ్ పేరు చెప్పి తినే తిండిని సగానికి తగ్గిస్తుంటారు. కానీ ఇలా నోరు కట్టేసుకోవడం వల్ల బరువు తగ్గడమేమో గానీ ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడం మాత్రం ఖాయమంటున్నారు నిపుణులు. అందుకే డైటింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టమంటున్నారు. అందులో భాగంగానే క్యాలరీలు తక్కువగా, పోషకాలు అధికంగా ఉన్న "బీరకాయ రైస్ సూప్" తీసుకోమని సలహా ఇస్తున్నారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- బీరకాయలు (మీడియం సైజు) - 2
- బాస్మతీ బియ్యం - 2 కప్పులు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- పోపు దినుసులు - టీస్పూన్
- ఎండుమిర్చి - 3
- వెల్లుల్లి తరుగు - 2 టీస్పూన్లు
- ఉల్లిపాయ - ఒకటి
- బంగాళాదుంప - ఒకటి
- ఎర్ర గుమ్మడికాయ ముక్కలు - ఒక కప్పు
- పసుపు - ముప్పావు టీస్పూన్
- నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్
- కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
- నిమ్మకాయ - ఒకటి
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా బీరకాయ, బంగాళదుంపను పొటు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఉల్లిపాయను కూడా సన్నగా తరగాలి. అలాగే బాస్మతీ బియ్యాన్ని కడిగి నానబెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. అది వేడెక్కాక పోపు దినుసులు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు ఇందులో ఎండు మిర్చి వేసి మరికాసేపు వేయించాలి.
- ఆ తర్వాత వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన బంగాళాదుంప, గుమ్మడికాయ, బీరకాయ ముక్కలు, పసుపు, నల్లమిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఇవి కాస్త మగ్గిన తర్వాత బాస్మతీ బియ్యాన్ని కూడా వేసేయాలి. మరోసారి బాగా కలుపుకొని.. ఇందులో 2 లీటర్ల నీళ్లు పోసి కలపాలి. స్టౌ సిమ్‌లో పెట్టి బియ్యంతో పాటు కూరగాయలు బాగా ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
- అన్నం, కూరగాయలు మెత్తగా ఉడికిన తర్వాత చివరన కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి మరోసారి కలిపి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే టేస్టీగా ఆరోగ్యాన్నిచ్చే బీరకాయ రైస్ సూప్ రెడీ!