Pink Sauce Pasta Recipe in Telugu:చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పాస్తాను ఇష్టంగా తింటారు. ఇక పాస్తాను కూడా రకరకాలుగా చేసుకుని తింటుంటారు. అయితే ఎంత టేస్టీగా ఉండే పాస్తా అయినా ఎప్పుడో ఒకే రీతిలో తినాలంటే బోర్ కొట్టిద్ది. వెరైటీగా చేసుకుని తినాలనిపిస్తుంది. కానీ చేసుకోవడం రాదు. అయితే ఇకపై మీకు ఇలాంటి టెన్షన్ అవసరం లేకుండా.. వెరైటీగా పింక్ సాస్ పాస్తా ప్రిపేర్ చేసుకోండి. ఈ పాస్తాను ఎక్కువగా కెఫె, రెస్టారెంట్లలో చేస్తుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 5 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె
- ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వెన్న
- 3 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు
- ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము
- పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు
- 10 బేసిల్ ఆకులు (ఆప్షనల్)
- 2 టమాటాలు
- ఒక కప్పు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికం ముక్కలు
- 5 పుట్టగొడుగు ముక్కలు
- ఒక టేబుల్ స్పూన్ టమాటా కెచప్
- అర టేబుల్ స్పూన్ ఎండ బెట్టిన పార్స్లే
- ఒక టేబుల్ స్పూన్ ఎండు మిరపకాయ గింజలు
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక టీ స్పూన్ మిరియాల పొడి
- 4 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న విత్తనాలు
- ఒక కప్పు పాస్తా
- 3 టేబుల్ స్పూన్ల వెన్న
- 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి
- ఒక కప్పు కాచిన పాలు
- 2 చీజ్ ముక్కలు
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ఓ గిన్నెలో ఆలివ్ నూనె, వెన్న, వెల్లుల్లి, అల్లం తురుము వేసి వేయించుకోవాలి. (వెల్లుల్లి కాస్త వేగితే సరిపోతుంది)
- ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, బెసిల్ ఆకులు వేసి వేయించుకోవాలి.
- ఇప్పుడు టమాటాలను మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్‌ను ఇందులో వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి.
- అప్పుడు ఇందులో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ క్యాప్సికం ముక్కలు, పుట్టగొడుగులు వేసి సుమారు 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. (బ్రొకలీ, బేబీకార్న్ కూడా వేసుకోవచ్చు)
- అనంతరం టమాటా కెచప్, ఎండబెట్టిన పార్స్లే, ఎండు మిరపకాయ గింజలు, ఉప్పు, మిరియాల పొడి, మొక్కజొన్న విత్తనాలు వేసి కలపాలి.
- ఆపైన పావు కప్పు నీరు పోసి దగ్గరపడేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మగ్గించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే స్టౌ పై ఓ గిన్నెలో నీరు, ఉప్పు, ఆలివ్ నూనె వేసి బాగా మరిగించుకోవాలి.
- ఇలా నీరు బాగా మరుగుతున్న సమయంలో పాస్తాను వేసుకుని 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి.
- ఇదే సమయంలో మరో స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెను తీసుకుని అందులో వెన్నను వేసి వేయించుకోవాలి.
- వెన్న కరిగిపోయే సమయంలోనే మైదా పిండిని వేసి కలపాలి. (వెన్న మొత్తం కరిగిపోయాక వేస్తే మైదా మాడిపోతుంది)
- ఇందులో కాచిన పాలు కొద్దిగా కొద్దిగా పోస్తూ బాగా కలపాలి.
- ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్న రెడ్ సాస్‌ను వేసి కలపాలి.
- ఆ తర్వాత ఉడికిన పాస్తా, అర కప్పు పాస్తాను ఉడికించిన నీరు ఇందులో వేసుకుని బాగా కలపాలి. (రుచి చూసి అవసరమైతే ఉప్పు వేసుకోవాలి)
- ఇప్పుడు చీజ్ ముక్కలను పాస్తాలో వేసి కాసేపు కలుపుకొని స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది.
బ్రెడ్ హల్వా చాలా సార్లు తిని ఉంటారు! - ఓ సారి రస్క్‌తో ట్రై చేయండి - ఆ మధురం అద్భుతం!!
పదే పది నిమిషాల్లో పసందైన "పచ్చిమిర్చి వేపుడు" - వేడివేడి అన్నంలో నెయ్యితో తిన్నారంటే అమృతమే!