Supreme Court On Freebies : ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి మంచిది కాదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితంగా రేషన్, డబ్బు ఇస్తుంటే పని చేసేందుకు ఇష్టపడటం లేదని అభిప్రాయపడింది. ఉచితాల కారణంగా ప్రజలు పనికి మొగ్గు చూపట్లేదని పేర్కొంది. ప్రజలను పరాన్నజీవులుగా మారుస్తున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
"దురదృష్టవశాత్తు ఈ ఉచితాల కారణంగా ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు. వారికి ఉచిత రేషన్లు లభిస్తున్నాయి. వారు ఎటువంటి పని చేయకుండానే ఆ మొత్తాన్ని పొందుతున్నారు. వారిపై(పౌరులపై) మీకున్న(ప్రభుత్వాలకు) శ్రద్ధకు మేము అభినందిస్తున్నాము. కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయడం మంచిది కాదా?" అని ప్రశ్నించింది.
కేంద్రప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే పనిలో ఉందని, నిరాశ్రయులకు ఆశ్రయం సహా పలు సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ఈ సందర్భంగా ధర్మాసనానికి తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ- ఈ నిర్మూలన మిషన్ ఎంతకాలం పాటు పని చేస్తుందో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను మరో ఆరు వారాలు వాయిదా వేసింది.