తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కమ్మటి "పండుమిర్చి పచ్చడి" - ఈ కొలతలతో పెడితే ఏడాది నిల్వ! - HOW TO MAKE PANDU MIRCHI PACHADI

- వేడి వేడి అన్నంలో అదుర్స్​ అనిపించే పండుమిర్చి పచ్చడి - ఇలా చేస్తే సూపర్​ టేస్ట్​తో పాటు నిల్వ కూడా!

How to Make Pandu Mirchi Pachadi
How to Make Pandu Mirchi Pachadi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 1:35 PM IST

How to Make Pandu Mirchi Pachadi:సాధారణంగానే పచ్చళ్లు, అందులోనూ సీజనల్​గా​ లభించే పచ్చళ్లను చాలా మంది ఇష్టపడతారు. వేడివేడి అన్నంలో కూసింత పచ్చడి వేసుకుని కనీసం రెండు ముద్దలైనా తింటేనే మనసుకు తృప్తిగా ఉంటుందని భావిస్తారు. ఇక ఈ సీజన్​లో పండుమిర్చి పచ్చడి స్పెషల్​. ఎర్రగా నిగనిగలాడే పండుమిర్చిలతో అద్దిరిపోయే విధంగా నిల్వ పచ్చడి ​చేసుకుంటారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పచ్చడి ఉంటే ఆరోజు గడిచిపోతుంది. అందుకే ఇదీ ఎప్పుడూ బోర్​ కొట్టొదు.

అయితే ఈ రోజుల్లో పచ్చడి ప్రిపేర్​ చేసుకునే తీరిక లేక కొందరు, పెట్టడం రాక మరికొందరు మార్కెట్లో తయారు చేసిన పచ్చళ్లను కొంటున్నారు. అయితే ఇప్పుడా అవసరం లేకుండా సూపర్​ టేస్టీగా పైగా సంవత్సరం నిల్వ ఉండేలా పండు మిర్చి పచ్చడి పెట్టుకోవచ్చు. మరి, లేట్​ చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • పండు మిర్చి - 1 కేజీ
  • చింతపండు - పావు కేజీ(250 గ్రాములు)
  • ఉప్పు - పావు కేజీ(250 గ్రాములు)
  • పసుపు - 2 టీ స్పూన్లు​
  • పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - అర కప్పు

తాలింపు కోసం:

  • వేరుశనగ నూనె - 100 గ్రాములు
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • ఎండుమిర్చి - 5
  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఇంగువ - చిటికెడు​

తయారీ విధానం:

  • ముందుగా పండు మిర్చిని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి వస్త్రంతో తుడవాలి.
  • పూర్తిగా తడి లేకుండా తుడిచిన తర్వాత తొడిమలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన పెట్టాలి.
  • చింతపండును కూడా శుభ్రం చేసుకోవాలి. అంటే గింజలు, తొక్కలు, పీచు లేకుండా శుభ్రంగా తీయాలి.
  • ఇప్పుడు మిక్సీజార్​ తీసుకుని అందులోకి చింతపండు, ఉప్పు వేసి ఓసారి గ్రైండ్​ చేయాలి. అయితే ఉప్పు ఒకేసారి వేయకుండా కొంచెం వేసి, మిగిలినది రుచి చూసిన తర్వాత వేసుకోవచ్చు.
  • ఆ తర్వాత అందులోకి కట్​ చేసిన పండు మిర్చి ముక్కలు వేసి మరోసారి గ్రైండ్​ చేసుకోవాలి.
  • అనంతరం పసుపు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి గ్రైండ్​ చేసుకోవాలి. అయితే ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్​ చేసుకుంటేనే తింటున్నప్పుడు రుచి బాగుంటుంది.
  • పచ్చడిని గ్రైండ్​ చేసుకున్న తర్వాత రుచి చూసుకుని సరిపోకపోతే మరికొంచెం ఉప్పు వేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని వెంటనే తాలింపు పెట్టకుండా తడి లేకుండా శుభ్రంగా తుడిచిన ఓ గాజు జార్​ లేదా జాడీలో వేసి మూత గట్టిగా పెట్టి ఓ రోజంతా ఊరనివ్వాలి. ఇలా ఊరనివ్వడం వల్ల అన్ని రుచులు సరిగ్గా సరిపోతాయి. అలాగే ఇలా ఊరిన పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంతమేర తాలింపు పెట్టుకోవచ్చు.
  • తాలింపు కోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ వేసి కలిపి పచ్చడిని తాలింపులో వేసుకుని ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి దింపితే సరి. అంతే ఎంతో రుచికరంగా సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడి రెడీ.
  • తాలింపు పెట్టిన పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు గిన్నెలోకి తీసుకుని వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకుని తింటే అమృతమే. నచ్చితే మీరూ ఇప్పుడే ట్రై చేయండి.

అద్దిరిపోయే 'టమాటా నిల్వ పచ్చడి' - ఇలా చేస్తే సువాసనకే నోట్లో నీళ్లు ఊరుతాయి!

"కొత్తిమీర నిల్వ పచ్చడి" - ఇలా చేస్తే వారెవ్వా! - కనీసం 6 నెలలు నిల్వ!

ABOUT THE AUTHOR

...view details