Sulaimani Tea Recipe in Telugu : "టీ" పేరు చెబితే చాలు మనలో చాలా మందికి ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. అలసట, నీరసం మాయమై రీఛార్జయిపోతాం. అయితే, ఎక్కువ మంది పాలు, టీ పొడితో తయారయ్యే నార్మల్ చాయ్ నే తాగుతుంటారు. అప్పుడప్పుడు ఇరానీ, జింజర్, గ్రీన్, లెమన్ వంటివి తీసుకుంటారు.
మరి, మీకు కేరళ స్పెషల్ "సులేమని టీ" గురించి తెలుసా? దీన్ని ఒక్కసారి తాగి చూడండి. సూపర్ టేస్టీతో వారెవ్వా అనిపిస్తుంది. ముఖ్యంగా భోజనం చేశాక దీన్ని ఒక్క గ్లాస్ తాగితే పొట్ట ఈజీగా తేలికపడుతుందట. తిన్న ఆహారం మంచిగా అరుగుతుందట. మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ టీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- వాటర్ - 1 లీటర్
- లవంగాలు - 6
- దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
- పంచదార - 3 నుంచి 4 టేబుల్‌స్పూన్లు
- టీ పొడి - 3 టేబుల్‌స్పూన్లు
- తాజా పుదీనా ఆకులు - 15 నుంచి 20
- నిమ్మకాయ - 1(పెద్దది)
ఇంట్లోనే అద్దిరిపోయే హోటల్ స్టైల్ అల్లం చాయ్ - చాలా మందికి ఈ టిప్స్ తెలియదు!
తయారీ విధానం :
- ముందుగా స్టౌపై ఒక గిన్నెలో లీటర్ వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో లవంగాలు, దాల్చిన చెక్క వేసి హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు మరగనివ్వాలి.
- ఆ విధంగా మరిగించుకున్నాక పంచదార యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద తెర్ల కాగనివ్వాలి. అయితే, ఇక్కడ మీరు చక్కెరకు బదులుగా బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు.
- 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా మరిగించుకున్న తర్వాత టీ పొడిని యాడ్ చేసుకొని ఒకసారి కలపాలి.
- టీ పొడిని యాడ్ చేసుకున్నాక మరోసారి మిశ్రమాన్ని హై ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
- మరీ ఎక్కువగా మరిగించుకుంటే డికాక్షన్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. అలాగే, దాన్ని తాగుతుంటే గొంతులోకి అంత స్మూత్‌గా పోదని గుర్తుంచుకోవాలి.
- అలా మరిగించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని మూతతీసి అందులో ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి, నిమ్మరసం పిండుకోవాలి. ఆపై కలిపి మూతపెట్టి రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇలా చేయడం ద్వారా ఫ్లేవర్స్ అన్నీ టీ లోకి మంచిగా దిగుతాయి.
- అనంతరం వేడివేడిగా గ్లాసులలో పోసుకొని సర్వ్ చేసుకుంటే చాలు.
- సూపర్ టేస్టీ కేరళ స్పెషల్ "సులేమని టీ" రెడీ అయిపోతుంది. ఛాన్స్ ఉంటే మీరు కూడా ఓసారి టేస్ట్ చేయండి.
మంచు కురిసే వేళ అద్దిరిపోయే "మసాలా టీ" - వేడివేడిగా గొంతులోకి దిగుతుంటే ఆ కిక్కే వేరబ్బా!