How to Make Pakam Puris Recipe : ఇప్పుడంటే స్వీట్లు తినాలనిపిస్తే క్షణాల్లోనే స్వీట్ షాప్ నుంచి ఆర్డర్ పెట్టడమో.. లేదా నేరుగా షాప్‌కి వెళ్లి తెచ్చుకోవడమో చేస్తున్నాం. కానీ, కొన్నేళ్ల క్రితం వరకు ఇంట్లోనే రకరకాల స్వీట్లు చేసుకునేవారు. అలాంటి స్వీట్లలో ఒకటి "పాకం పూరీలు". స్వీట్లు ఇష్టంగా తినేవారికి పాకం పూరీల పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి.
ఆంధ్రాలోని ప్రతి ఇంట్లో పండగల సమయంలో తప్పకుండా ఈ పాకం పూరీలు చేస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ స్వీట్ పూరీలు.. వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. మరి.. వీటిని ఎలా తయారు చేయాలి? పాకం పూరీలు పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- మైదా పిండి -పావు కేజీ
- ఉప్పు-అరటీస్పూన్
- నెయ్యి -టేబుల్‌స్పూన్
పాకం కోసం..
- చక్కెర- అరకేజీ
- నీళ్లు- రెండు గ్లాసులు
- యాలకులపొడి- అరటీస్పూన్
తయారీ విధానం..
- ముందుగా ఒక ప్లేట్లో మైదా పిండి తీసుకుని అందులో నెయ్యి, ఉప్పు వేసి పిండి పొడిగా మారేంత వరకు కలుపుకోండి. ఇక్కడ మీరు మైదాకు బదులుగా గోధుమ పిండి కూడా ఉపయోగించుకోవచ్చు.
- ఆ తర్వాత కొద్దిగా కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలపండి. పిండి చపాతీల పిండిలా ఉండాలి. ఈ పిండిపై తడివస్త్రం కప్పి 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి అందులో చక్కెర వేయండి. నీళ్లు పోసి చక్కగా తీగ పాకం వచ్చేంత వరకు వేడి చేయండి. పాకం ఎంత చిక్కగా ఉంటే పూరీలు అంత రుచిగా ఉంటాయి. తీగ పాకం రాగనే అందులో యాలకులపొడి వేసుకుని పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని అన్ని పూరీలు చేసుకోండి.
- పూరీలు ఫ్రై చేయడానికి గిన్నెలో సరిపడా ఆయిల్ పోసుకుని బాగా వేడి చేయండి.
- వేడివేడి నూనెలో పూరీలు వేసుకుని కాల్చుకోండి. కాలిన పూరీలను పంచదార పాకంలో వేసి నిమిషం ఉంచండి.
- తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఈ పాకం పూరీల రుచి చల్లారిన తర్వాత ఒకలా.. వేడివేడిగా ఉన్నప్పుడు మరోలా ఉంటుంది.
- ఇలా పాకం పూరీలు చేస్తే కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. నచ్చితే మీరు కూడా పాకం పూరీలను ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
గోధుమ పిండితో బాదుషా! - రుచి, ఆరోగ్యం ఒకేసారి - ఈ పండక్కి ఇలా తయారు చేయండి
స్వీట్ షాప్ స్టైల్లో "బూందీ లడ్డూ" - ఈ టిప్స్‌తో తయారు చేస్తే అమోఘమైన రుచి!