How to Make Nalla Karam in Telugu:మనకు జ్వరం వచ్చినప్పుడు, లేదా ఒంట్లో బాగాలేనప్పుడు ఏదీ తినాలనిపించదు. ఎంత మంచి వంటకం వండినా సరే.. నాలుకకు రుచి అనిపించదు. అలాంటి పరిస్థితులకు పర్ఫెక్ట్ రెసిపీ ఈ నల్లకారం. వేడి వేడి అన్నంలో కొద్దిగా నల్ల కారం, కొంచెం నెయ్యి కలుపుకొని తింటే ఆహా.. టేస్ట్ అద్దిరిపోతుంది. కేవలం జ్వరం వచ్చినవాళ్లే కాదు.. కాస్త ఛేంజోవర్ కోరుకునేవాళ్లకు కూడా కారప్పొడి సూపర్ ఛాయిస్. మరి ఇంకెందుకు ఆలస్యం? దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 100 గ్రాముల ఎండు మిరపకాయలు
- 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు
- పావు కప్పు ధనియాలు
- ఒకటిన్నర టేబుల్ స్పూన్ల జీలకర్ర
- ఉసిరికాయ సైజంత చింతపండు
- కొద్దిగా కరివేపాకు
- రుచికి సరిపడా ఉప్పు (కళ్లుప్పు వేస్తే బెటర్)
- 10 వెల్లుల్లి పాయలు
- నూనె
తయారీ విధానం
- ముందుగా ఎండు మిరపకాయలను తీసుకుని తొడిమలు తీసేయాలి. ఆ తర్వాత మిరపకాయలను మధ్యలోకి తుంచి పెట్టుకోవాలి.(ఇలా చేసి వేయించుకుంటే మధ్యలోని గింజలు బాగా వేగి రుచిగా ఉంటుంది)
- ఆ తర్వాత స్టౌ వెలిగించుకుని ఓ గిన్నెలో వెల్లుల్లి పాయలు వేసి వేగించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- అనంతరం ఆ గిన్నెలోనే నూనె పోసుకుని వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు ముందుగా తుంచిపెట్టుకున్న ఎండు మిరపకాయలను వేసి బాగా వేయించుకోవాలి. (లో ఫ్లేమ్‌లో పెట్టుకుని వేగించుకోవాలి)
- మిరపకాయలు రంగు మారాక దించేసుకుని పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి.
- ఆ తర్వాత అదే గిన్నెలో నూనె పోసి శనగపప్పు, ధనియాలు వేసి వేయించుకోవాలి.
- అనంతరం జీలకర్ర వేసుకుని రంగు మారేవరకు దోరగా వేయించుకోవాలి.(లో ఫ్లేమ్‌లోనే పెట్టి వేయించుకోవాలి)
- ఇందులోకి చింతపండు, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకుని స్టౌ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి.
- ఇప్పుడు ముందుగా చల్లారబెట్టుకున్న ఎండు మిరపకాయలు, ఉప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. (కంటిన్యూగా గ్రైండ్ చేయకుండా ఆపుతూ తిప్పాలి. ఇలా చేస్తే కారం ముద్ద కాకుండా నల్లగా వస్తుంది)
- ఆ తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న పోపు దినుసులను వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
- లైట్‌గా వేయించుకున్న వెల్లులిపాయలను వేసుకుని ఒక్కసారి తిప్పుకుంటే టేస్టీ నల్ల కారం రెడీ!
కొంచెం పుల్లగా.. కొంచెం కారంగా - నోరూరించే దోసకాయ మిర్చి పచ్చడి - ఇలా ప్రిపేర్ చేయండి! - Dosakaya Endu Mirchi Pachadi
నిగనిగలాడే దొండకాయలతో అద్దిరిపోయే రోటి పచ్చడి - ఇవి కలపండి - అమోఘమైన టేస్ట్ చూస్తారు! - Dondakaya Pachadi Recipe in Telugu