Crystal Tortoise Vastu In Telugu : సాధారణంగా తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకుంటే ఆర్థికంగా కలిసి వస్తుందని విశ్వాసం. ముఖ్యంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి, వాస్తు దోషాలను తొలగించుకోవడానికి కొన్ని రకాల వస్తువులను పెట్టుకుంటారు. అటువంటి వాటిలో క్రిస్టల్ తాబేలు ఒకటి. వాస్తు ప్రకారం మాత్రమే కాదు ఫెంగ్ షుయి వాస్తులో కూడా తాబేలు ప్రతిమకు ప్రత్యేక స్థానం ఉంది.
ఆధ్యాత్మికంగా
ఇటు ఆధ్యాత్మికంగా చూసినా కూడా శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కూర్మావతారం రెండవది. క్షీర సాగర మథనం సమయంలో శ్రీ మహావిష్ణువు మంధర పర్వతం మునిగిపోకుండా తాబేలు అవతారం దాల్చి అమృతోత్పాదనకు సహకరించాడు. అలాంటి తాబేలు ప్రతిమను ఇంట్లో ఉంచుకుంటే సుఖశాంతులు నెలకొంటాయని విశ్వాసం. ఈ తాబేలులో రకాలున్నాయి. ఒకొక్క తాబేలుకి ఒకొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో క్రిస్టల్ తాబేలు ఏ దిశలో పెట్టుకుంటే శుభప్రదమో తెలుసుకుందాం.
ఉత్తర దిక్కున పాజిటివ్ ఎనర్జీ
ఇంట్లోని వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే క్రిస్టల్ తాబేలును ఉత్తర దిశలో పెట్టుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు. కనుక క్రిస్టల్ తాబేలు ఉత్తర దిశను చూస్తున్నట్లు పెడితే ఆ ఇంట్లో నివసించే వారి ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి ఆర్థికంగా బలపడతారు.
నైరుతి దిశలో కలహాలు దూరం- అనారోగ్య సమస్యలు మాయం
ఇంట్లో క్రిస్టల్ తాబేలు నైరుతి దిశలో పెట్టుకుంటే భార్య భర్తల మధ్యన ఉన్న కలహాలు సమసిపోతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
నీటిలో ఉంచితే ఈ ఫలితం
క్రిస్టల్ తాబేలు నీటి ఫౌంటెన్ కు దగ్గరగా కానీ, నీరు ఉన్న తొట్టెలో కానీ ఉంచితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది. వృత్తి పరంగా ఎలాంటి సమస్యలున్నా దూరమవుతాయని, సర్వత్రా విజయం చేకూరుతుందని వాస్తు శాస్త్ర పండితులు తెలియచేస్తున్నారు.
ఈ దిక్కులో మాత్రం వద్దు
అయితే క్రిస్టల్ తాబేలును పొరపాటున కూడా ఆగ్నేయం, ఈశాన్యం దిక్కుల్లో పెట్టుకోవద్దని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. దీని వలన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ దిక్కులో క్రిస్టల్ తాబేలు పెట్టుకోవడం నిషిద్ధమని అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం మనం కూడా వాస్తు నిపుణులు చెప్పినట్లుగా క్రిస్టల్ తాబేలును సరైన దిశలో పెట్టుకుందాం అదృష్టలక్ష్మిని ఆహ్వానిద్దాం.
శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.