Legal Advice For Family Problem : దేశంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వారిపై వేధింపులు ఆగడం లేదు. పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం అత్తింట్లో ఇబ్బంది పడేవారు కొందరైతే.. ప్రేమ పేరుతో ప్రియుడి చేతిలో మోసపోయే వారు మరికొందరు. ఇలా నిత్యం మన చుట్టూ ఎంతో మంది మహిళలు నిస్సహాయ స్థితిలో ఉండడం మనం గమనిస్తుంటాం. అయితే, అలాంటి ఓ మహిళ గురించి మనం ఇక్కడ మనం చర్చించుకోబోతున్నాం.
"నేను కులాంతర వివాహం చేసుకున్నాను. నా మ్యారేజ్ కోసం ఉన్న ఒకే ఒక్క ఇంటినీ అమ్మేసి అమ్మ ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటోంది. మా ఆయన పాప పుట్టేవరకూ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లో జాబ్కి వెళ్లి మరో అమ్మాయితో రిలేషన్ నడుపుతున్నాడు. నన్ను విజయవాడలోనే ఒంటరిగా వదిలేశాడు. తీసుకెళ్లమని అడిగితే కులం తక్కువదాన్ని పెళ్లి చేసుకున్నా.. ఇక్కడే ఉండు అంటున్నాడు. ఇప్పుడు అమ్మదగ్గరికి వెళ్లి భారమవ్వలేననిపిస్తోంది. ప్రస్తుతం నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు" అని ఓ సోదరి న్యాయ నిపుణులను సలహా అడిగారు. ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది జి.వరలక్ష్మి ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం.
ఎన్ని చట్టాలు చేసినా రోజురోజుకీ ఆడవాళ్లపై వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. నేటి ఆధునిక యుగంలోనూ మహిళల కష్టాలు తీరడం లేదు. అయితే, మీ అమ్మ ఇల్లు అమ్మి మీ మ్యారేజ్ చేసే బదులు దాన్ని మీ పేరున రాసి జరిపిస్తే బాగుండేది. మహిళలకి ఆర్థిక స్వాతంత్య్రం ఉంటే మగవారి దాష్టీకాలు కొంత వరకైనా తగ్గుతాయి. మీ ఆయన వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం చట్టవ్యతిరేకం. భార్య బతికి ఉండగానే ఇలా చేస్తే హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 13 ప్రకారం.. దీనిని ఒక కారణంగా చూపించి విడాకులు తీసుకోవచ్చు. ఇంకా మిమ్మల్ని హింసించడాన్నీ క్రూరత్వంగా చూపించొచ్చు. కానీ, దానివల్ల మీ భర్తకే ఇంకా లాభం కలుగుతుంది.
"మీకు డివోర్స్ కావాలనుకుంటే.. పై చట్టంలోని సెక్షన్-25 కింద ఇచ్చిన కట్నం, నగలు, పెళ్లి ఖర్చులు, పిల్లల భవిష్యత్తు అవసరాలకు అయ్యే మొత్తం అన్నింటికీ కలిపి పెద్ద ఎత్తున పరిహారం కోరవచ్చు. డివోర్స్ వద్దనుకుంటే గృహహింస నిరోధక చట్టంలోని సెక్షన్ -18 కింద రక్షణ, ఇంట్లో నివసించే హక్కు (సెక్షన్-19), నెలవారీ భత్యం(సెక్షన్-20), కస్టడీ ఆర్డర్స్(సెక్షన్-21), పైన చెప్పిన అన్నింటికీ కలిపి పరిహారం(సెక్షన్-22) అడగవచ్చు." -జి.వరలక్ష్మి (ప్రముఖ న్యాయవాది)
ముందు పోలీస్ స్టేషన్‌లోనైనా, ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరైనా వెళ్లి కంప్లయింట్ ఫైల్ చేయండి. మహిళా సంఘాల సహాయం తీసుకోండి. మీరు లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదిస్తే.. వారు మీ తరఫున వాదించడానికి లాయర్‌ని కేటాయిస్తారు. ముందుగా మీ ఆయనను పిలిచి కౌన్సెలింగ్ చేస్తారు. మీ సమస్య పరిష్కారం కాకపోతే కోర్టుకి పంపుతారు. కాబట్టి, అధైర్యపడకుండా మీ పాపను పోషించడానికి మీకు కావాల్సిన ఆధారాల గురించి ఆలోచించండి.
Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. న్యాయవాదుల సలహాలు, చట్ట ప్రకారం పాటించాల్సిన సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత న్యాయవాది సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
'పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. అమ్మాయిలతో తిరుగుతున్నాడు' - ఏం చేయాలి?