How to Take Care of Plants in Winter: మొక్కలు పెంచడం అనేది ఇప్పుడు చాలా మందికి ఫేవరెట్‌గా మారిపోయింది. మనసు ప్రశాంతంగా ఉండటానికి, ఇంటి అవసరాల కోసం చాలా మంది తమ ఇళ్లలో రకరకాల మొక్కలను పెంచుతున్నారు. కొంచెం ప్లేస్ ఉన్నా సరే అందులోనే మొక్కలు నాటుతున్నారు. మొక్కలు నాటడం వరకు బాగానే ఉన్నా.. వాటి సంరక్షణ విషయంలో మాత్రం కొద్దిమంది జాగ్రత్తగా ఉంటే.. మరికొద్దిమంది మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే.. కాలానికి తగినట్టు మనం ఆరోగ్యంపై ఏవిధంగా దృష్టిపెడతామో.. మొక్కల సంరక్షణ విషయంలోనూ అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో వాటి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అప్పుడే అవి చక్కగా ఎదుగుతాయని వివరిస్తున్నారు. మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- చలికాలంలో మొక్కల్లో ఎదుగుదల తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతి పదిహేను రోజులకోసారి తక్కువ మోతాదులో బోన్‌మీల్, కంపోస్ట్ ఎరువులు వంటివి అందించాలని.. అప్పుడే మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయని చెబుతున్నారు.
- శీతాకాలంలో మొక్కలు నాటిన మట్టి పొడిబారకుండా చూసుకోవాలంటున్నారు. అలాగని అతిగా నీళ్లు పోయడమూ చేయొద్దంటున్నారు. తగినంత తేమ ఉంచడానికి మొక్క చుట్టూ మల్చింగ్ చేస్తే సరి. మల్చింగ్ అంటే మొక్కల చుట్టూ నేలపై ఒక రకమైన కవచం లాగా పదార్థాలను వేయడమే. అంటే ఎండిన ఆకులు, గడ్డి, పీట్ మాస్, కంపోస్ట్, వరి గడ్డి, చెరుకు పిప్పి, కొబ్బరి పీచు వంటి పదార్థాలు మొక్కల చుట్టూ వేయడం వల్ల నేల తేమను నిలుపుకుంటుందని.. ఇది మొక్కలకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.
- కొన్ని మొక్కలు ఏ కాలాన్ని అయినా తట్టుకుని బతుకుతాయని.. కొన్ని మొక్కలు సున్నితంగా ఉంటాయని.. అలాంటివాటిని రాత్రిపూట చలిగాలుల నుంచి రక్షణ కల్పించాలని అంటున్నారు. ఇందుకోసం ప్లాస్టిక్ కవర్లను వాడమని సలహా ఇస్తున్నారు. రాత్రి ప్లాస్టిక్ కవర్లు కప్పి.. ఉదయం మాత్రం సూర్యరశ్మి తగినంతగా అందేలా చూసుకోవాలంటున్నారు. మొక్కలకు ఎండ సరిపోవడం లేదంటే వాటికి కృత్రిమ లైట్ల కాంతిని అందించాలని సూచిస్తున్నారు.
- చాలా మంది చలికాలంలో మొక్కలను కత్తిరిస్తే అవి త్వరగా ఎదగవని భావించి అలానే వదిలేస్తారు. అయితే ప్రూనింగ్ చేయకపోయినా ఎప్పటికప్పుడు ఎండిన పువ్వులు, ఆకులు వంటివన్నీ తీసేయాలని.. మొదళ్ల చుట్టూ ఉండే మట్టినీ శుభ్రపరుచుకోవాలంటున్నారు. అప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు.
- చలికాలంలో చీడ పీడల సమస్య కాస్త ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా పేనుబంక, బూడిదతెగులు వంటివి ఎక్కువ కనిపిస్తాయి. ఈ క్రమంలో దీనికి పరిష్కారంగా బేకింగ్‌సోడా, వేపనూనె, నీళ్లు కలిపిన మిశ్రమాన్ని అప్పుడప్పుడూ స్ప్రే చేస్తే.. మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు.
కుండీల్లో మొక్కలు పెంచుతున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే అవి హెల్దీగా పెరుగుతాయట!
మీ నిమ్మచెట్టు ఎదగడం లేదా? - ఈ టిప్స్ పాటిస్తే కాయలు పుష్కలంగా కాస్తాయి!
మొక్కలు ఏపుగా పెరగాలంటే రసాయనాలే అవసరం లేదు! - ఈ పదార్థాలు వేసినా చాలు!