How to Make Kalyana Rasam Recipe : చలికాలంలో ఏ ఆహారమైనా వేడివేడిగా తింటే.. ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే చాలా ఇళ్లలో వేడివేడి అన్నంలో రసం తినడానికి ఆసక్తి చూపిస్తారు. రసంతో తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుందని భావిస్తారు. అందుకే.. దాదాపు అందరి ఇళ్లలో టమాటా, మిరియాల రసం చేస్తుంటారు. కానీ, ఎప్పుడూ వీటితోనే తినాలంటే బోర్ అనిపిస్తుంది. అందుకే మీకు కొత్త రసం రెసిపీ పరిచయం చేయబోతున్నాం. అదే తమిళనాడు స్టైల్ "కళ్యాణ రసం". ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా రసం చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ రసంతో పిల్లలు పెద్దలందరూ ఇష్టంగా భోజనం చేస్తారు. మరి, ఇక ఆలస్యం చేయకుండా కమ్మటి కళ్యాణ రసం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
- కందిపప్పు - కప్పు
- ఎండుమిర్చి - 4
- టమాటా - 1
- చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజంత
- మిరియాలు - టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 8
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - టీస్పూన్
- పసుపు - అర టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- వాటర్ సరిపడా
- కరివేపాకు -4 రెమ్మలు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- ఇంగువు - పావు టీస్పూన్
తయారీ విధానం:
- ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోండి. ఇందులో రెండు గ్లాసుల నీరు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి. ఆపై పప్పుని మెదుపుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి.
- అలాగే టమాటా సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి.
- ఆ తర్వాత మిరియాలు, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి.
- అలాగే చింతపండు కొద్దిసేపు నీటిలో నానబెట్టి.. చింతపండు రసం రెడీ చేసుకోండి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి వేపండి.
- ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఎండుమిర్చి ముక్కలు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
- స్టవ్ సిమ్లో పెట్టి ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి.
- టమాటాలు మెత్తగా అయ్యాక.. ఉడికించుకున్న పప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు పావు లీటర్ నీళ్లు పోసి మూత పెట్టి.. మీడియం ఫ్లేమ్ మీద ఓ పొంగు వచ్చే వరకు మరిగించాలి.
- రసం మరుగుతున్నప్పుడు చింతపండు రసాన్ని పోసి మిక్స్ చేయాలి. అనంతరం కరివేపాకులు, గ్రైండ్ చేసిన మిరియాలు, వెల్లుల్లి మిశ్రమం వేసి కలపండి.
- ఇప్పుడు కాస్త కొత్తిమీర తరుగు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఓ పొంగు వచ్చేవరకు మరిగించుకోవాలి.
- ఆ తర్వాత ఇంగువ వేసి మరో నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఇలా సింపుల్గా చేసుకుంటే ఘుమఘుమలాడే కళ్యాణ రసం రెడీ.
- ఈ రసంతో చలికాలంలో వేడివేడి అన్నం ఓ రెండు ముద్దలు ఎక్కువే తింటారు. నచ్చితే మీరూ ఓసారి ఇంట్లో ట్రై చేయండి.
చలికాలంలో వేడి వేడి "మిరియాల చారు" - దగ్గు, జలుబుకు చక్కటి మందు
చలిలో వేడి వేడిగా "వెల్లుల్లి రసం" - మాటల్లేవ్.. ఆస్వాదించాల్సిందే!