How to Make Hyderabadi Mutton Tahari: బిర్యానీ లేదా పులావ్.. ఈ పేర్లు వింటేనే చాలా మందికి నోట్లో లాలాజలం ఊరుతుంది. ఇక సండే వచ్చిందంటే కచ్చితంగా ఇంట్లో వీటిని ప్రిపేర్ చేసుకుని తినాల్సిందే. పులావ్‌లు, బిర్యానీలు చాలా రకాలే ఉంటాయి. చికెన్, మటన్ అంటూ నచ్చిన తీరులో వండుకుని తింటుంటారు. అయితే.. ఎప్పుడూ తినే మటన్ బిర్యానీ లేదా పులావ్ తింటే బోర్ కొట్టడం పక్కా. అందుకే అలాంటి ఫీలింగ్ లేకుండా ఉండటానికి ఈసారి హైదరాబాదీ మటన్ తహరి చేసేయండి. మెతుకు మెతుకూ ఎంతో రుచిని కలిగి ఉంటుంది. అంతేనా.. తింటున్నా కొద్దీ మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచి దీని సొంతం. దీనిని చేయాలంటే వంట వచ్చిన వాళ్లే అవసరం లేదు.. బ్యాచిలర్స్, కొత్తగా వంటే చేసే వారు కూడా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేయవచ్చు. మరి, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
హైదరాబాదీ మటన్ తహరికి కావాల్సిన పదార్థాలు:
మటన్ ఉడికించడం కోసం:
- మటన్ - అర కిలో
- ఉప్పు - 1 టీ స్పూన్
- కారం - 1 టీ స్పూన్
- పసుపు - పావు టీ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
- నీరు - అర లీటర్
తహరి కోసం:
- బాస్మతీ బియ్యం - రెండు కప్పులు
- నూనె - పావు కప్పు
- యాలకలు - 5
- లవంగాలు - 5
- దాల్చిన చెక్క - 2 ఇంచ్‌లు
- షాజీరా - అర టేబుల్ స్పూన్
- ఉల్లిపాయలు - 2(మీడియం సైజ్)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- టమాటాలు - 2
- పసుపు- పావు టీ స్పూన్
- రుచికి సరిపడా కారం
- చిలికిన పెరుగు - అర కప్పు
- వేడి నీరు - 1 కప్పు
- పచ్చిమిర్చి చీలికలు - 4
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- మెంతి ఆకుల తరుగు - కొద్దిగా
- పుదీనా తరుగు - కొద్దిగా
- గరం మసాలా - 1 టీ స్పూన్
- నిమ్మరసం - అర చెక్క
రైస్ కుక్కర్లో "ఎగ్ మసాలా దమ్ బిర్యానీ" - చాయ్ పెట్టినంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు!
తయారీ విధానం:
- ముందుగా బాస్మతీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఓ గంట పాటు నానబెట్టుకోండి.
- ఆ తర్వాత ఉల్లిపాయలు. టమాటలు, పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే చిన్న సైజ్ మెంతి కూర కట్టను సన్నగా కట్ చేసుకోండి. అలాగే పుదీనా, కొత్తిమీరను అలానే చేసుకోవాలి.
- ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి మీడియం సైజ్‌లో కట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీరు పోసి కలిపి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు మరో స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఉల్లిపాయ తరుగు వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత టమాట ముక్కలు, పసుపు, కొద్దిగా కారం వేసి కలుపుకుని టమాటలు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ముందే మటన్ ముక్కలు ఉడికించుకోవడానికి కారం వాడాం కాబట్టి మీరు తినగలిగేంత కారాన్ని టమాటాల్లో వేయాలి.
- ఆ తర్వాత పెరుగు వేసి కలిపి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు ఉడికించిన మటన్ ముక్కలను నీళ్లు లేకుండా వేరే గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. మటన్ ఉడికించగా మిగిలిన నీళ్లను పక్కకు పెట్టండి. అవి తర్వాత ఉపయోగపడతాయి.
- నూనె పైకి తేలిన తర్వాత మటన్ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద ఓ నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు బాస్మతీ బియ్యంలో నీరు ఒంపుకోవాలి.
- మటన్ ముక్కలు వేగిన తర్వాత బాస్మతీ బియ్యాన్ని వేసి గింజలోని చెమ్మ ఆరేంతవరకు, బియ్యం విరగకుండా నిధానంగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత నీరు పోసుకోవాలి. అయితే ఇక్కడ మొత్తంగా 2.5 కప్పుల నీరు అవసరమవుతాయి. కాబట్టి మటన్ ఉడికించగా మిగిలిన నీరు ఎంత ఉందో కొలుసుకుని బియ్యంలో పోసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన కొలతకు వేడి నీరు పోసుకుని కలుపుకోవాలి.
- నీరు పోసిన తర్వాత కలిపి పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా, మెంతి కూర తరుగు, గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి మూత పెట్టి మంటను హై ఫ్లేమ్ మీద పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి మరో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత తింటే ఉంటుంది.. రుచికి గురించి చెప్పాలంటే మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది. అంత బాగుంటుంది దీని టేస్ట్. మరి మీరు కూడా ఈ సండే ఇంట్లో ట్రై చేస్తారా?
పెళ్లిలో వడ్డించే "మటన్ దాల్చా" టేస్ట్ వేరే లెవల్! - ఆ రుచి ఇంట్లో కూడా కావాలా? - ఇలా ప్రిపేర్ చేయండి!
సండే స్పెషల్: అద్దిరిపోయే "మటన్ ఛుడ్వా" - ఈ అద్భుతమైన రుచిని ఆస్వాదించండిలా!
సండే స్పెషల్ : మిలిటరీ మటన్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? - ఇలా ప్రిపేర్ చేస్తే మసాలా నషాళానికి అంటుతుంది!