How To Make Palak Paneer at Home :పనీర్ అనగానే చాలా మందికి నోరూరిపోతుంది. పనీర్ అంటే ఇష్టపడని వారుండరు. సరిగ్గా వండాలే గానీ ఎంతో రుచిగా..ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే విధంగా ఉంటుంది. కేవలం కూర మాత్రమే కాకుండా దీంతో టిక్కా, పనీర్ బటర్ మసాలా, కడాయి పనీర్ లాంటి ఎన్నో రకాల వంటలను తయారు చేసుకుంటారు. అయితే వీటన్నింటి కన్నా కూడా పాలక్ పనీర్ అంటే ఆ క్రేజ్ వేరే లెవల్ ఉంటుంది. నోరూరించే ఈ పాలక్ పనీర్‌ను పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇక పాలక్ పనీర్ తినాలంటే దాబాకే వెళ్లాలనుకుంటారు. అయితే అలాంటి అవసరం లేకుండా ఇంట్లోనే దాబా స్టైల్లో ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు
- పాలకూర - 1 కట్ట
- పనీర్ - 250 గ్రాములు
- అల్లం ముక్కలు - 1 టీస్పూన్
- వెల్లుల్లి ముక్కలు - 1 టీస్పూన్
- జీడిపప్పు - 15
- బాదం - 10
- ఎండు కొబ్బరి పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
- నూనె - సరిపడా
- లవంగాలు - 4
- దాల్చిన చెక్క - కొద్దిగా
- జీలకర్ర - 1 టీ స్పూన్
- ఉల్లిపాయలు - 2
- పసుపు - పావు టీ స్పూన్
- పచ్చిమిర్చి - 4
- కరివేపాకు - కొద్దిగా
- పుదీనా - కొద్దిగా
- కారం - సరిపడా
- ఉప్పు - సరిపడా
- ధనియాల పౌడర్ - 1 టేబుల్ స్పూన్
- కసూరి మేథీ - 1 టీ స్పూన్
- కొత్తిమీర - కొద్దిగా
- గరం మసాలా - 1 టేబుల్ స్పూన్
- నెయ్యి లేదా వెన్న - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
- ముందుగా ఒక కట్ట పాలకూర తీసుకుని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నీళ్లు పోసి పాలకూరను కాసేపు ఉడికించుకోవాలి. అనంతరం పాలకూర చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి
- మరోవైపు మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లి, అల్లం ముక్కలు, జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి పౌడర్‌ను వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించుకున్న పాలకూరను వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరి అవసరమైతే కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో కడాయి పెట్టి.. నూనెను పోసి వేడి చేసుకోవాలి.
- నూనె వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసుకోని ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఎర్రగా అయ్యేవరకు వేగించాలి.
- అనంతరం పసుపు, పచ్చిమిర్చీ, కరివేపాకు, పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి.
- అన్ని బాగా ఉడికాక ముందుగా గ్రైండ్ చేసిన పాలకూర మిశ్రమాన్ని వేసి కలపాలి.
- ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకుని దగ్గరగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
- నూనె పైకి తేలినప్పుడు బాగా కలిపి.. పాలకూర ఉడికించినప్పటి నీటిని కొద్దిగా పోసుకోవాలి.
- కాసేపు మరిగాక.. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి.
- అనంతరం పనీర్ ముక్కలు, కసూరి మేథీ, కొత్తిమీరను అందులో వేసుకోని బాగా కలుపుకోవాలి.
- కాసేపయ్యాక అరస్పూన్ గరం మసాలా వేసుకుని.. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ముక్కలు ఉడకనివ్వాలి.
- చివరగా కొత్తిమీర, నెయ్యి లేదా వెన్న వేసుకోని కలుపుకుంటే సూపర్ పాలక్ పనీర్ రెడీ!
నోరూరించే 'వంకాయ టమాట పచ్చడి' - ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ అదుర్స్! - Brinjal Tomato Chutney
ఉల్లిపాయలు లేకుండా 'లాహోరి గ్రీన్ చికెన్' - తిన్నారంటే మైమరచిపోతారు! ఓ సారి ట్రై చేయండి! - Lahori Green Chicken Curry