Chettinad Aloo Fry Recipe : దేశంలో తమిళనాడులోని చెట్టినాడు వంటలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి వెరైటీలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారి వంటల్లో రుచి ఎంత అమోఘంగా ఉంటుందో.. కారం, మసాలా ఘాటు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే.. ఇక్కడి వంటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి రెసిపీల్లోంచి ఒకదాన్ని మనం ఇవాళ పిక్ చేసుకున్నాం. అదే.. చెట్టినాడు ఆలూ ఫ్రై.
ఈ ఆలూ ఫ్రై.. మనం రెగ్యులర్ గా చేసే వేపుడుకన్నా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. రుచి అంతకు మించి అన్నట్టుగా ఉండే ఈ టేస్టీ ఫ్రైని.. వేడి వేడి అన్నంలో నెయ్యితో లాగించేయొచ్చు. ఇంకా.. పెరుగన్నంలో నంజుకోవడానికి కూడా అద్దిరిపోతుంది. మరి.. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్ధాలు..
ఉడికించుకున్న ఆలుగడ్డలు - 1/2 kg
నూనె - 1/4 cup
పసుపు - 1/4 spoon
ఆవాలు - 1 tsp
జీలకర్ర - 1 tsp
కరివేపాకు - 1 రెబ్బ
మసాలా పొడి కోసం..
ధనియాలు - 2 tsps
సెనగపప్పు - 1 tbsp
మినపప్పు -1 tsp
సోంపు - 1 tsp
1 inch దాల్చిన చెక్క - 1 inch
లవంగాలు - 5
అనాస పువ్వు - 1
మరాటి మొగ్గ - సగం ముక్క
ఎండుమిర్చి - 6
తయారీ విధానం..
- ముందుగా బంగాళాదుంపలు ఉడికించి.. పొట్టుతీసి, ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇష్టమైనవాళ్లు పొట్టు తీయకుండానే కట్ చేసుకోవచ్చు.
- ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి.. మసాలా దినుసలన్నీ అందులో వేసి.. లో-ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి.
- ఎరుపు రంగులోకి, మంచి సువాసన వచ్చేంత వరకూ ఫ్రై చేయాలి.
- ఆ తర్వాత వాటిని చల్లార్చి.. కాస్త బరకగా మిక్సీ పట్టుకొని, పక్కన పెట్టుకోండి.
- ఇప్పుడు మరో పాన్లో నూనె వేడిచేసి, అందులో ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, పసుపు వేసి కాసేపు ఫ్రై చేసుకోండి.
- తర్వాత అందులో ఉడికించిన బంగాళా దుంప ముక్కలు వేసి, మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా మారే వరకూ ఫ్రై చేసుకోవాలి.
- ఆలుగడ్డలను మూత పెట్టకుండానే ఫ్రై చేయాలి. ఇవి ఎర్రగా ఫ్రై కావడానికి కనీసం ఇరవై నిమిషాలపైన సమయం పడుతుంది.
- ఆలూ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత.. ముందే మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేయాలి.
- మసాలా పొడి వేసిన తర్వాత.. అదంతా ఆలూ ముక్కలకు పట్టేలా కలుపుకొని.. నాలుగైదు నిమిషాలు ఉంచి స్టౌ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
- అద్దిరిపోయే చెట్టినాడు ఆలూ ఫ్రై మీ ముందు ఉంటుంది.
టేస్టీ టిప్స్..
- ఈ చెట్టినాడు ఫ్రై కోసం.. బంగాళాదుంపలు పలుచటి పొర ఉన్నవి అయితే మంచిది. ఫ్రై కరకరలాడుతూ ఉంటుంది.
- ఆలుగడ్డలను ఉడికిస్తున్నప్పుడు 80 % మాత్రమే ఉడికేలా చూసుకోండి. మిగిలిన 20 శాతం ఫ్రై చేస్తున్నప్పుడు మగ్గిపోతుంది. ముందే పూర్తిగా ఉడికితే.. ఫ్రై చేస్తున్నప్పుడు ముక్కలు చెదిరిపోయి ఫ్రై పొడిపొడిగా తయారవుతుంది.
- ఈ ఫ్రై నాన్ స్టిక్ పాన్ మీదకన్నా.. ఐరన్ ముకుడులో చేస్తే చాలా బాగా ఉంటుంది.
- నచ్చితే.. తప్పకుండా మీరూ ఒకసారి ట్రై చేయండి.
కార్తిక మాసం స్పెషల్ - ఉల్లి, వెల్లుల్లి లేకుండా అద్దిరిపోయే రుచితో "ఆలూ కుర్మా" - ఇలా ట్రై చేయండి!
స్పెషల్ లంచ్ రెసిపీ: "ఘుమఘుమలాడే పులావ్, అదుర్స్ అనిపించే ఆలూ కుర్మా"- ఇలా చేస్తే రుచి అద్భుతం!