Andhra Man Dies In Goa : న్యూ ఇయర్ పార్టీ చేసుకోవడానికి గోవా వెళ్లిన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంనకు చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం స్థానిక ఆరో వార్డుకు చెందిన బొల్లా రవితేజ (28) అనే వ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.
రెస్టారెంట్‌లో వివాదం : నూతన సంవత్సర వేడుకలను తన స్నేహితులతో కలిసి జరుపుకోవాలని అనుకున్నారు. దీంతో తన ఏడుగురు స్నేహితులతో కలిసి గత శనివారం (డిసెంబరు 28న) హైదరాబాద్ నుంచి గోవా వెళ్లారు. సోమవారం (డిసెంబరు 30న) రాత్రి కలంగుట్ బీచ్‌లో వీరంతా సరదాగా గడిపి, పక్కనే ఉన్న మరీనా బీచ్‌షాక్ అనే రెస్టారెంట్‌కు భోజనం చేయడానికి వెళ్లారు. రెస్టారెంట్ బిల్లులో ధరలు అధికంగా ఉన్నాయని వీరితో పాటు వచ్చిన ఓ యువతి అక్కడి నిర్వాహకుడిని ప్రశ్నించారు. దీంతో వారి మధ్య స్వల్ప వివాదం చెలరేగింది.
కర్రలతో తీవ్రమైన దాడి : ఈ క్రమంలో రెస్టారెంట్ యజమాని కుమారుడు సుబెట్ సిల్వేరా ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఘర్షణ జరిగింది. ఇది చూసిన రవితేజ ఆ యువతికి సాయం చేయబోయాడు. అంతే, అదే అతని చివరి రోజు అయ్యింది. రెస్టారెంట్‌లో పని చేసే కొందరు సిబ్బంది రవితేజపై కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. తలకు గట్టిగా దెబ్బలు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి మృతదేహాన్ని తెప్పించింది. అక్కడి నుంచి తాడేపల్లిగూడెంలోని నివాసానికి గురువారం (జనవరి 2) చేరుకుంది.
నడిరోడ్డుపై భర్తకు ఉరేసి చంపిన భార్య - నెట్టింట వీడియో వైరల్