New Ration Cards Update : కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకునే వారికి పౌర సరఫరాల శాఖ తీపి కబురు తెలిపింది. ఇప్పటివరకు దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయానికి తెర దించింది. కొత్త దరఖాస్తులు మీ-సేవ ద్వారా స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకు సోమవారం సివిల్ సప్లయిస్ భవన్‌లో మీ సేవ అధికారులతో ఆ శాఖకు సంబంధించిన అధికారులు చర్చించారు. ఈ సమావేశంలో మీ-సేవలో కొత్త దరఖాస్తులు స్వీకరించడానికి మీ-సేవ అధికారులు అంగీకారం తెలిపారు. దీంతో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అధికారులు పునరుద్ధరించారు. దీని ఫలితంగా మీ-సేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం సాయంత్రం నుంచి మొదలైంది.
3 రోజులుగా గందరగోళంలో దరఖాస్తుదారులు : ఫిబ్రవరి 7వ తేదీన కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు మీ-సేవ వెబ్‌సైట్‌లో ఆప్షన్ అందుబాటులో ఉంచాలని పౌర సరఫరాల శాఖ మీ-సేవ అధికారులకు ఓ లేఖను రాసింది. ఆ లేఖకు అనుగుణంగా అదే రోజు రాత్రి నుంచి వెబ్‌సైట్‌లో సదరు ఆప్షన్‌ను అధికారులు ఉంచారు. దీంతో ఆ ఆప్షన్ అందరికీ కనిపించింది. దీంతో కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునే వారు ఆనందంగా మీ-సేవ కేంద్రాలకు వెళ్లి చేసుకోవచ్చని అనుకున్నారు.
ఫిబ్రవరి 8వ తేదీన ఉదయం మీ-సేవ కేంద్రాల వద్దకు వెళ్లి పడిగాపులు కాశారు. మీ-సేవ కేంద్రాల సిబ్బంది ఆప్షన్‌ను తీసేశారని చెప్పడంతో అప్పటివరకు కేంద్రాల వద్ద బారులు తీరిన దరఖాస్తుదారులు అయోమయానికి లోనయ్యారు. కొన్నిచోట్ల విమర్శలు సైతం వచ్చాయి. దీంతో తాజా సమావేశంలో ఈ విషయమై పౌర సరఫరాల శాఖలో లోతైన చర్చే జరిగింది. ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడో మొదలై ఉండటం, కేబినెట్ నిర్ణయం ముందే జరగడంతో సాంకేతికంగా ఎలాంటి సమస్యలు రావన్న అభిప్రాయం ఉన్నతాధికారులు వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని మీ-సేవ అధికారుల్ని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో సోమవారం సాయంత్రం నుంచి దరఖాస్తుల స్వీకరణను మీ-సేవ నిర్వాహకులు ప్రారంభించారు. దీంతో రేషన్ దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖ అనుసరించిన తీరుతో మూడు రోజుల పాటు దరఖాస్తుదారుల అందరిలో గందరగోళం నెలకొంది.
మళ్లీ దరఖాస్తు చేయనక్కర్లేదు : కొత్తగా రేషన్‌కార్డుల కోసం కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.
కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి గుడ్‌న్యూస్ - మీ సేవ కేంద్రాల్లోనూ
కొత్త రేషన్‌కార్డుల కోసం మీ-సేవకు వెళ్తున్నారా? - ఇది తెలుసుకోకపోతే మీకే కష్టం