Tenth Class Student Died in Rajanna Sircilla District : ప్రస్తుత కాలంలో పిల్లలు ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. దీంతో భయపడి ప్రాణాలు తీసుకుంటున్నారు. అందరిలో ఉన్నప్పుడు వారిని వేలేత్తి చూపిస్తే అంతే. తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. ఒంటరిగా ఉంటూ ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచించి, మనసును పాడు చేసుకుంటున్నారు. అందరి ముందు అవమానం జరిగిందని భావించి ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.
తోటి విద్యార్థినితో మాట్లాడినందుకు గ్రామానికి చెందిన యువకులు కొట్టారు. ఆపై విద్యార్థిని తల్లి కూడా ఇంటికి వచ్చి బాలుడితో పాటు అతడి తల్లిని దూషించింది. ఈ రెండు ఘటనలను అవమానంగా భావించిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని గంభీరావుపేట మండలంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, మండలంలోని ఓ గ్రామంలో విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు.
జనవరి 1న పదో తరగతికి చెందిన ఓ విద్యార్థినితో సరదాగా మాట్లాడుతున్నాడు. ఇది గమనించిన ఐదుగురు యువకులు అతన్ని గ్రామ శివారుకు తీసుకెళ్లారు. అనంతరం బాలుడిని కొట్టారు. మరోసారి ఆ విద్యార్థినితో మాట్లాడవద్దని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి సైతం బాలుడితో పాటు అతని తల్లిని దూషించింది. దీంతో విద్యార్థి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అదే రోజు రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తన కుమారుడి మృతికి కారణం అయిన యువకులతో పాటు విద్యార్థిని తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామానికి చెందిన కందుకుల నవీన్, అంబటి హరిబాబు, కాసారం ప్రవీణ్, గెరిగంటి రాకేశ్, సోమారపు నివాస్, విద్యార్థిని తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. విద్యార్థి తండ్రి గల్ఫ్‌లో ఉన్నాడు. దీంతో విద్యార్థి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నారు.
ఏవండీ పిల్లలు జాగ్రత్త - లైంగిక వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య
నకిలీ ఫోన్‌పేతో మోసం చేస్తూ పట్టుబడ్డ యువకుడు - అవమానం భరించలేక ఆత్మహత్య - Fake Phonepe Man Suicide