Atukula Murukulu Recipe :టిఫెన్ చేయడానికి ఎక్కువ సమయం లేనప్పుడు.. అటుకులతో అద్దిరిపోయే ఉప్మా చేసుకుంటారు జనం. అంతేకాదు.. ఇడ్లీలు, దోశలు, వడలు రుచికరంగా రావడానికి కూడా అటుకులను కలుపుతుంటారు. అయితే.. అటుకులతో చాలా క్రిస్పీగా కరకరలాడే జంతికలు కూడా తయారు చేయవచ్చని మీకు తెలుసా? ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా మురుకులు చేశారంటే.. అద్భుతమైన రుచిని ఆస్వాదిస్తారు. ఈ జంతికలను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా సూపర్ టేస్టీ స్నాక్ ఐటమ్ అటుకుల జంతికలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు :
- అటుకులు-కప్పు
- పుట్నాల పప్పు- అరకప్పు
- బియ్యం పిండి-కప్పు
- జీలకర్ర-టీస్పూన్
- నువ్వులు-టీస్పూన్
- కళోంజి విత్తనాలు-టీస్పూన్
- ఉప్పు- రుచికి సరిపడా
- మిరియాల పొడి-చిటికెడు
- నూనె-వేయించడానికి సరిపడా
- ఉప్పు లేని బటర్-టేబుల్‌స్పూన్
అటుకుల మురుకులు తయారీ విధానం:
- ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అటుకులు, పుట్నాల పప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి.
- ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిని జల్లించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మురుకుల పిండి కలపడం కోసం.. ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో నువ్వులు, జీలకర్ర, కళోంజి విత్తనాలు, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే బటర్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యిని వేడి చేసి ఉపయోగించవచ్చు.
- ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. పిండిని చాలా సాఫ్ట్‌గా మారేంత వరకు కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యేలోపు.. మురుకులు ప్రిపేర్ చేసుకునే మెషీన్ లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి.
- తర్వాత రెడీ చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిముద్దను తీసుకొని మురుకుల గొట్టంలో తీసుకోవాలి.
- వేడిగా ఉన్న నూనెలో మీకు నచ్చిన ఆకారంలో మురుకులు పిండిని వత్తుకోవాలి
- లేకపోతే.. చిల్లుల గరిటె తీసుకొని దాని మీద మీకు కావాల్సిన షేప్‌లో పిండిని వత్తుకొని ఆపై వాటిని కాగే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు.
- మురుకులను రెండు వైపులా గోల్డెన్ కలర్లో కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే.. ఇలానే పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
- సింపుల్‌గా ఇలా చేసుకుంటే క్రిస్పీ అటుకుల మురుకులు రెడీ అయిపోతాయి. మీకు నచ్చితే ఓసారి ట్రై చేయండి.