How to Cook Mutton Quickly :కొన్నిసార్లు మటన్ వండేటప్పుడుఎంత సమయమైనా ముక్క సరిగా ఉడకదు. దీంతో ఏం చేయాలో తోచక చాలా మంది వేడి నీళ్లు పోసి మళ్లీ ఉడకబెడుతుంటారు. ఇలా చేయడం వల్ల టైమ్ వృథా అవడమే కాకుండా.. టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకే.. మీకోసం కొన్ని టిప్స్ తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం.
టీ డికాషన్ :మటన్ వండటానికి ముందు.. వడకట్టిన (చక్కెర వేయనిది) టీ డికాషన్‌ని మాంసంలో పోసి అరగంట అలాగే ఉంచాలి. ఆ తర్వాత కూర వండితే మటన్ త్వరగా ఉడుకుతుందట. టీలో ఉండే ట్యానిన్లు మటన్ త్వరగా, మెత్తగా ఉడికేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
వెనిగర్/నిమ్మరసం :వెనిగర్ లేదా నిమ్మరసం వంటివి దాదాపు ప్రతి కిచెన్‌లోనూ ఉంటాయి. ఇవి కూడా మటన్ త్వరగా ఉడికేందుకు సహాయం చేస్తాయి. వీటిలో ఉండే ఆమ్లత్వం మటన్ మృదువుగా ఉడికించడమే కాకుండా.. కూరకు మంచి రుచిని కూడా అందిస్తాయి.
బొప్పాయి ఆకు :మటన్ఫాస్ట్గా మృదువుగా ఉడకడానికి బొప్పాయి ఆకు లేదా పచ్చి బొప్పాయిని కూడా వాడవచ్చు. ఇందులోని పపైన్ అనే పదార్థం.. మాంసాన్ని ఫాస్ట్‌గా ఉడికేలా చేసి ముక్కల్ని మృదువుగా మార్చుతాయి.
టమాటాలతో :టమాటాల్లో ఆమ్ల గుణం ఉంటుంది. అందుకే వీటిని ప్యూరీలా చేసి వేయడం లేదా సాస్ రూపంలో వేయడం వల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది. అయితే, ఎక్కువ మంది నాన్‌వెజ్ వంటకాల్లో టమాటా ముక్కలను తర్వాత వేస్తుంటారు. అలా కాకుండా వీటిని తాలింపులోనే వేస్తే మటన్ త్వరగా ఉడుకుతుంది.. కూరకు అదనపు టేస్ట్ కూడా వస్తుంది.
రాళ్ల ఉప్పు :ఎక్కువ మంది మటన్ కూరలో సాధారణ ఉప్పు వేస్తుంటారు. ఇలా కాకుండా ఓ సారి ఈ విధంగా ప్రయత్నించండి. ముందుగా మటన్ కడిగి నీళ్లన్నీ పోయేలా గట్టిగా పిండండి. ఆ తర్వాత మాంసంలో కొద్దిగా గళ్లుప్పు వేసి బాగా మిక్స్ చేయండి. దీనిని ఒక గంట పాటు వదిలేసి.. ఆ తర్వాత కూర వండితే మాంసం త్వరగా ఉడుకుతుంది. మాంసం ఉప్పును బాగా పీల్చుకొని మెత్తగా మారడమే ఇందుకు కారణం.