How to Make Gongura Boti Fry:నాన్‌వెజ్‌లో ఎక్కువ మంది ఇష్టపడే వంటకాలలో ఒకటి.. బోటీ. దీని పేరు చెప్తేనే ఎంతో మందికి నోరూరిపోతుంది. అలాంటి వారికోసమే ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. గోంగూర బోటీ ఫ్రై. అయితే.. చాలా మంది బోటీతో వంటకాలు అనగానే ఎక్కువ టైమ్ తీసుకుంటాయనుకుంటారు. కానీ.. ఈ రెసిపీని చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా ఈ టిప్స్ ఫాలో అవుతూ తయారు చేసుకున్నారంటే ఒక్కరే కర్రీ మొత్తం తిన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు! అంత టేస్టీగా ఉంటుంది! మరి, ఇంకెందుకు ఆలస్యం.. ఈ సూపర్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బోటీ - 500 గ్రాములు
- నూనె - పావు కప్పు
- కరివేపాకు - 2 రెమ్మలు
- పచ్చిమిర్చి - 3
- ఉల్లిపాయ - 1(పెద్ద సైజ్‌లో ఉన్నది)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పసుపు - పావు చెంచా
- కారం - తగినంత
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
- గోంగూర - 1 కట్ట
- చింతపండు రసం - 2 టేబుల్ స్పూన్లు
- గరం మసాలా - 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా కుక్కర్‌లో బోటీ వేసి తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత బోటీని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి.
- బోటీ ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయను తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే.. గోంగూరను గిల్లి శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ముందుగా కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త వేయించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఆనియన్స్ కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయలు వేగాయనుకున్నాక.. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆపై పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని మసాలాలన్ని కలిసేలా మిక్స్ చేసుకొని బాగా వేపుకోవాలి.
- ఇక మసాలాలన్నీ బాగా వేగాయనుకున్నాక.. తరిగి పెట్టుకున్న గోంగూర తరుగును అందులో వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గోంగూర మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి.
- గోంగూర బాగా మగ్గిందనుకున్నాక.. ఉడికించి పక్కన పెట్టుకున్న బోటీని ఆ మిశ్రమంలో వేసి మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి.
- ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టకుండా కలుపుతూ 4 నుంచి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం ద్వారా బోటీలోని వాసనంతా పోతుంది. ఆవిధంగా వేయించుకున్నాక.. ఉప్పు వేసి కలుపుకొని మరో 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
- ఇక కూర మంచి వాసన వస్తుందని అనుకున్నప్పుడు.. 200ఎంఎల్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆపై మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ముక్క మెత్తబడి కూర దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఉడకడానికి కనీసం 30 నుంచి 40 నిమిషాల వరకు పడుతుంది.
- ఇక కర్రీలోని నీరంతా ఇగిరిపోయి ముక్క ఉడికిందనుకున్నాక.. చివరగా గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకొని దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "గోంగూర బోటీ ఫ్రై" రెడీ!