తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బంగారం కొనుగోలు చేస్తున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే మంచిది! - GOLD BUYING TIPS IN TELUGU

- ఈ జాగ్రత్తలు పాటించకపోతే మోసపోయే అవకాశం

Gold Buying Tips in Telugu
Gold Buying Tips in Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2024, 4:51 PM IST

Gold Buying Tips in Telugu :బంగారం.. ఈ పేరు చెప్పగానే మహిళల ముఖాల్లో వచ్చే వెలుగు మాటల్లో చెప్పలేనిది. మగువలకు, బంగారానికి విడదీయరాని సంబంధం ఉంటుంది. పెళ్లి, ఫంక్షన్​.. ఇలా వేడుక ఏదైనా కొద్దో గొప్పో మెడలో వేసుకుని మురిసిపోవాల్సిందే. అక్షయ తృతీయ, ధన త్రయోదశి, దీపావళికి స్వర్ణభరణాల కొనుగోళ్లు ఏ రేంజ్​లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. పసిడి ఎప్పుడూ కొన్నా.. తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

చాలా వరకు స్వచ్ఛమైన బంగారంతో చేసిన నగలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిదంటున్నారు. ఇలా కొనడం వల్ల ఎప్పుడు మార్చుకున్నా పూర్తిస్థాయిలో నష్టం ఉండదు. ఒకవేళ రాళ్ల నగలు కొంటుంటే... రాళ్లు, బంగారం విలువను వేర్వేరుగా చూపిస్తున్నారో లేదో గమనించుకోవాలి. సాధారణ రాళ్లకు అసలు విలువ ఉండదు. కానీ కొన్ని షాపుల నిర్వాహకులు వీటికీ ధర ఎక్కువగా వేస్తుంటారు. అందుకే బిల్లు వేసేటప్పుడే దానికి విలువ కట్టకుండా మాట్లాడుకోవాలి. కెంపులు, పగడాలు, అన్‌కట్స్‌కి కాస్త రీసేల్ వాల్యూ ఉంటుంది.

  • స్వర్ణాభరణాలు కొంటున్నప్పుడు వాటి స్వచ్ఛతను సూచించే హాల్‌మార్క్ గుర్తు ఆ నగల మీద ఉంటుంది. అది ఉందో లేదో గమనించాలి. ఒకవేళ అది లేకపోతే ఎట్టి పరిస్థితులల్లోనూ వాటిని కొనకపోవడమే మంచిది.
  • నగలు కొనుగోలు చేసిన తర్వాత బిల్లు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది దుకాణాదారులు తెల్ల కాగితం మీద బిల్లు రాసి ఇస్తుంటారు. అలా ఇచ్చిన బిల్లును ఎప్పుడూ తీసుకోవద్దు. దుకాణం వివరాలు, రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్‌వాయిస్ మాత్రమే తీసుకోవాలి. కంప్యూటర్ బిల్లు అయితే మరీ మంచిది. అందుకే.. ఒక గ్రాము బంగారం కొన్నా సరే దానికి వచ్చే బిల్లును తప్పనిసరిగా భద్రపరచుకోవాలి. ఒకవేళ బంగారం నాణ్యత విషయంలో మోసపోతే కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించవచ్చు. అలాగే BIS కేర్‌ యాప్‌ ద్వారా బంగారం స్వచ్ఛత గురించి స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు.
  • ఒకేసారి గోల్డ్​ కొనలేము అనుకునేవారు.. వివిధ స్కీముల్లో డబ్బులు కడుతుంటారు. అయితే.. అది నమ్మకమైన, పేరు కలిగిన సంస్థల్లో కట్టినప్పుడు మాత్రమే మన డబ్బుకు, బంగారానికి సెక్యూరిటీ ఉంటుంది. బంగారం అప్పటికప్పుడు కొనుగోలు చేయాల్సిన అవసరం లేకపోతే కడ్డీలు, నాణేల రూపంలో కొనవచ్చు.
  • కొన్ని పెద్ద పెద్ద షాపులు తరుగు, మజూరీ కలిపి అధిక ఛార్జీ వేస్తుంటాయి. దీనికి అదనంగా జీఎస్టీ చెల్లించాలి. కాబట్టి కొనే ముందు ఇవన్నీ పక్కాగా అర్థం చేసుకోగలిగితే డబ్బు వృథా కాదు.
  • బంగారాన్ని డిజిటల్‌ రూపంలోనూ కొనవచ్చు. దీనినే ‘డిజిటల్‌ గోల్డ్‌’గా పిలుస్తుంటారు. ఇక వీటి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానమై ఉంటాయి. ఒకవేళ బంగారం ధరలు పెరిగితే దీన్ని అమ్ముకోవచ్చు కూడా! ఆయా సంస్థల నుంచి కొన్న గోల్డ్​ను డిజిటల్‌ వాల్ట్‌లో నిల్వ చేస్తారు. నామినల్​ ఛార్జీలు చెల్లించి ఈ బంగారాన్ని కావాల్సినప్పుడు భౌతికంగా పొందచ్చు. ఈ బంగారం 100 శాతం స్వచ్ఛమైనదే కాకుండా సురక్షితంగా భద్రపరచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details