How To Make Aloo Rice Recipe :చాలా మంది తల్లులు పిల్లల లంచ్ బాక్స్‌లోకి వైట్ రైస్, ఏదైనా కర్రీ పెట్టి పంపుతుంటారు. అది వాళ్లకు పరమ బోరింగ్‌గా ఉంటుంది. అందుకే.. సగం తిని మిగిలింది ఇంటికి పట్టుకొస్తుంటారు. అందుకే.. తరచుగా మీరు వెరైటీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుండాలి. అందుకోసమే 'ఆలూ రైస్' రెసిపీ తీసుకొచ్చాం. ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ అదే కావాలని అడుగుతారు! ఇంతకీ,ఆలూ(Potato)రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బాస్మతి రైస్ - 250 గ్రాములు
- బంగాళదుంపలు - 4
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
- లవంగాలు, యాలకులు - 4 చొప్పున
- బిర్యానీ ఆకులు - 3
- దాల్చిన చెక్క ముక్కలు - 3
- పచ్చిమిర్చి - 6
- ఉల్లిపాయ - 1
- కరివేపాకు రెమ్మలు - 2
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- టమాటా - 1(పెద్ద సైజ్‌లో ఉన్నది)
- పచ్చి బఠాణీలు - పావు కప్పు
- పసుపు - అర టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
గ్రేవీ కోసం :
- ఎండుకొబ్బరి - కొద్దిగా
- జీడిపప్పు - 2 టేబుల్‌స్పూన్లు
- ధనియాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
- సోంపు - అర టీస్పూన్
- యాలక్కాయ - 1
తయారీ విధానం :
- ముందుగా ఒక బౌల్లో బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ మీ ఇష్టానికి అనుగుణంగా బాస్మతీ రైస్ లేదా మామూలు రైస్ ఏదైనా తీసుకోవచ్చు.
- ఆలోపు మీరు రెసిపీలోకి కావాల్సిన బంగాళదుంపలను పైపొట్టు తీసి క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా కాస్త పొడుగ్గా.. టమాటాను చిన్న సైజ్ ముక్కలు తరుక్కొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అందులో వేసి కాసేపు వేయించుకోవాలి.
- తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
- ఇప్పుడు టమాటా, ఆలూ ముక్కలు, పచ్చి బఠాణీలు వేసి ఒకసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆపై పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరోసారి కలిపి మూతపెట్టి టమాటా ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి.
- ఈలోపు ఇందులోకి కావాల్సిన గ్రేవీ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్లో పొడుగ్గా కట్ చేసుకున్న ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, సోంపు, యాలక్కాయ వేసి ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరోసారి మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై ఉన్న మిశ్రమం మగ్గిందనుకున్నాక.. అందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం నానబెట్టుకున్న రైస్‌ను వడకట్టి మిశ్రమంలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత రైస్ ఉడకడానికి కావాల్సినంత వాటర్(పావు తక్కువ రెండు గ్లాసులు) వేసుకోవాలి. అదే.. మామూలు రైస్ అయితే రెండు గ్లాసులు వేసుకోవచ్చు.
- ఆ విధంగా వాటర్ వేసుకున్నాక మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపి.. ఉప్పు సరిపోయిందో లేదా చెక్ చేసుకోవాలి. ఇక చివరగా కుక్కర్ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- అనంతరం.. స్టౌ ఆఫ్ చేసి కుక్కర్లోని ప్రెజర్ పోయాక మూత తీసి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే ఘుమఘుమలాడే 'ఆలూ రైస్' లంచ్ బాక్స్‌లోకి రెడీ!
ఇవీ చదవండి :
ఆలుగడ్డతో అద్దిరిపోయే వడలు పది నిమిషాల్లోనే! - ఇలా ప్రిపేర్ చేస్తే వహ్వా అంటారు!
రెస్టారెంట్ స్టైల్లో ఆలూ 65 - ఇలా చేశారంటే ఇంట్లో వాళ్లందరూ వావ్ అనాల్సిందే!