Dubai Princess Sheikh Introduces New Perfume Name Divorce :తలాక్.. భార్యకు మూడుసార్లు ఈ మాట చెబుతూ భర్త విడాకులు తీసుకునే ఇస్లాం సంప్రదాయం గురించి మనకు తెలిసిందే. కానీ దుబాయి యువరాణి షైకా మాత్రం ఇందుకు పూర్తిభిన్నంగా భర్తకు తలాక్ మూడు సార్లు చెప్పి విడాకులు తీసుకుంది. అలా చేసి వార్తల్లో నిలిచింది.
తాజాగా ఈ యువరాణి చేసిన మరో ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. త్వరలోనే తాను ‘డివోర్స్’ పేరుతో ఓ పెర్‌ఫ్యూమ్‌ని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. సాధారణ పరిమళానికి మించి ఇందులో ఎన్నో ప్రత్యేకతలున్నాయంటోన్న షైకా ఇక్కడా ‘డివోర్స్’ అనే పదం వాడడంతో వైవాహిక బంధంలో ఆమె ఎన్ని చేదు అనుభవాలు ఎదుర్కొందో అర్థమవుతోందంటున్నారు నెటిజన్లు. తన భర్తకు తనే విడాకులిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించడం, తన వ్యక్తిగత విషయాల గురించి ధైర్యంగా వెల్లడించడంతో ఈ యువరాణి సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది.
సంప్రదాయాలపై మక్కువ :దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధాని-ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూమార్తె షైకా. ఆమె తల్లి జో గ్రిగోరకోస్ది గ్రీస్ దేశం. బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించింది షైకా అంతర్జాతీయ వ్యవహారాల్లో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందింది. ఇలా ఇటు యూఏఈ సంస్కృతీ సంప్రదాయాల్ని ఎంతగా ఇష్టపడతానో అటు గ్రీకు సంప్రదాయాలన్నా తనకు అంతే మక్కువంటోంది ఈ యువరాణి.
తాను పుట్టింది దుబాయ్‌లోనే అయినా గ్రీస్‌లో మా అమ్మ వద్ద పెరిగటం వల్ల చిన్నప్పట్నుంచి గ్రీస్ సంస్కృతీ సంప్రదాయాలకు బాగా కనెక్ట్ అయిపోయాను అంటుంది షైకా. అలాగే పెరిగి పెద్దయ్యే క్రమంలో నాపై మా అమ్మ ప్రభావం ఎంతో ఉందంటుంది. తను తన జీవితంలో ఎప్పుడూ కుటుంబానికి ప్రాధాన్యమిస్తాను అని చెబుతోంది. ప్రస్తుతం నేను గ్రీకు భాషలో అనర్గళంగా మాట్లాడగలంటున్న ఆమె ఇప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా గ్రీస్ వెళ్లొస్తుంటానంటుంది.
'చిన్నప్పుడు పాచిపనులు చేశా..' అందాల రాణి కన్నీటి గాథ!
రాజ కుటుంబీకులు చాలా వరకు కెమెరా ముందుకు రారు కానీ షైకా మాత్రం ఇందుకు భిన్నం. తన తల్లంటే తనకెంతో ఇష్టమని చెప్పే ఆమె అమ్మతో దిగిన ఫొటోల్ని తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తద్వారా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని చాటుతుంటుంది.
మహిళల సాధికారత కోసం కృషి :అందమే కాదు అందమైన మనసూ షైకా సొంతం. సమాజ సేవే తన ప్రథమ కర్తవ్యంగా చెప్పుకొనే షైకా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపట్టింది. అంతేకాదు దుబాయ్ వ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థలకూ తన మద్దతిస్తోంది. ‘దుబాయ్ ఫౌండేషన్ ఫర్ విమెన్ అండ్ చిల్ట్రన్’ అనే ఎన్జీవోకు తన సహకారాన్ని అందిస్తోన్న యువరాణి ఈ క్రమంలో గృహ హింస, మానవ అక్రమ రవాణా, బాలల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తోంది. ఇక ‘అల్ జలీలా ఫౌండేషన్’కు మద్దతిస్తూ ‘వైద్య విద్య-రీసెర్చ్’కు కావాల్సిన నిధుల్ని అందిస్తోంది.
పేద పిల్లలకు ఉచిత విద్యను అందించడానికి తనవంతు కృష్టి చేస్తుంది. అందుకు వివిధ రకాలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మరోవైపు అక్కడి ఆస్పత్రులు పేషెంట్లకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. అంతేకాకుండా మహిళల సాధికారత, విద్య, ఆరోగ్యం పట్ల వారికి అవగాహన కల్పించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి నిధులు సమీకరించడానికి తన వంతు సహాయం చేస్తుంది.
దుబాయ్ యువరాణి షైకాకు ఫ్యాషనర్‌గానూ పేరుంది. నిండుదనంతో కూడిన దుస్తుల్నే ఫ్యాషనబుల్‌గా ధరించి ఆయా ఈవెంట్లకు మెరుస్తుంటుంది. ఇలా ఆమె ఫ్యాషన్ లుక్స్‌కీ సోషల్ మీడియాలో బోలెడు ఫ్యాన్సే ఉన్నారు. అంతేకాదు బ్యూటీ, ఫ్యాషన్ వంటి అంశాల్లో పట్టున్న ఆమె స్థానికంగా ఉండే బ్రాండ్స్‌కు తన వంతు సహకారం చేస్తుంటుంది. వాటిని రూపొందించేవారిని ప్రోత్సహిస్తుంటుంది.
మనమిద్దరం మాత్రమే అంటూ పోస్ట్ : ప్రతి ఆడపిల్లా తన పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది. షైకా కూడా అంతే ఎన్నో కలలుకంది. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్‌ను గతేడాది జూన్‌లో వివాహమాడిన ఎన్నో కలలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. వీళ్ల ప్రేమకు గుర్తుగా ఈ ఏడాది మేలో అమ్మాయి జన్మించింది. ఈ విషయాన్ని ఎంతో సంతోషంగా సోషల్ మీడియాలో పంచుకుంది షైకా. ఆపై కొన్ని రోజులకే తన కూతురితో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ ‘మనిద్దరం మాత్రమే’అంటూ క్యాప్షన్ జోడించింది. ఇలా తన భర్తతో విడిపోతున్నట్లు పరోక్షంగా వెల్లడించిన షైకా ఇటీవలే అధికారికంగా తన విడాకుల విషయాన్ని ప్రకటించి అందరినీ షాక్‌కి గురి చేసింది.
"ప్రియమైన భర్తకు మీరు ఇతరుల సహచర్యం కోరుకుంటున్నారు అందుకే నేను మీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఐ డివోర్స్ యూ, ఐ డివోర్స్ యూ, ఐ డివోర్స్ యూ టేక్ కేర్ ఇట్లు మీ మాజీ భార్య." అంటూ పోస్ట్ పెట్టింది
ఇక ఇదే సమయంలో దంపతులిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేశారు. వారు కలిసి దిగిన ఫొటోల్నీ తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో తొలగించారు దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. ఇలా షైకా తన వ్యక్తిగత విషయాల గురించి ధైర్యంగా చెప్తుండడంతో చాలామంది ఆమెను ప్రశంసిస్తూ పోస్టులు షేర్ చేశారు.
డివోర్స్ పేరిట పెర్‌ఫ్యూమ్ :విడాకులు తీసుకుంటే చాలామంది తమ జీవితం అక్కడితో ముగిసిపోతుందనుకుంటారు, కానీ విడాకులనేది మన జీవితాలకు అంతం కాదని సరికొత్త ప్రారంభమని చెబుతోంది షైకా. ‘మాహ్‌రా ఎం1’ పేరుతో పెర్‌ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ వేదికగా తాను తీసుకురాబోతున్న తొలి పెర్‌ఫ్యూమ్ విశేషాల్ని తాజాగా పంచుకుంది. అయితే ఈ పెర్ఫ్యూమ్కి ఆమె పెట్టిన ‘డివోర్స్’ అనే పేరు ప్రస్తుతం ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా మారింది.
దీనికి సంబంధించిన వీడియోలో భాగంగా నలుపు రంగు గులాబీలు, అద్దం పగిలిపోవడం, నల్ల పిల్లి కళ్లు ఇలా అన్నీ ప్రతికూల అంశాలే ఉండడంతో ప్రస్తుతం ఈ డివోర్స్ పెర్‌ఫ్యూమ్ వార్తల్లో నిలిచింది. అయితే తన తొలి పెర్‌ఫ్యూమ్‌కు‘డివోర్స్’అనే పేరు పెట్టడంతో ఈ యువరాణి తన వైవాహిక బంధంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొందని అందుకే ఆమె ఆ పేరు పెట్టిందని అని నెటిజన్లు భావిస్తున్నారు.
‘డివోర్స్’ అన్న పదం వినగానే చాలామంది తమ జీవితం ఆగిపోయినట్లుగా ఫీలవుతారు. విడాకులు తీసుకున్న వారు తమ జీవితం ఇక్కడితో ముగిసిపోయిందనుకుంటారు. కానీ ఇది మన జీవితంలో సరికొత్త దశకు ఆరంభం. అందుకే ఈ పెర్‌ఫ్యూమ్ కేవలం పరిమళానికే పరిమితం కాదు మానసిక దృఢత్వం, స్వీయ ప్రేమ, శక్తి సామర్థ్యాలకూ ప్రతీక!’ అంటూ తనలోని పాజిటివిటీని బయటపెట్టిందీ యువరాణి. ఇలా అడుగడుగునా సానుకూల దృక్పథం నింపుకొన్న షైకాపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
- రాజ కుటుంబమే అయినా నిరాడంబరంగా ఉండే షైకా తన సోషల్ మీడియా ఫాలోవర్లు, తన చుట్టూ ఉండే వారిలో ఎప్పుడూ స్ఫూర్తి నింపేలా పోస్టులు పెడుతుంటుంది.
- అరబిక్, గ్రీక్, ఇంగ్లిష్.. వంటి భాషల్ని అనర్గళంగా మాట్లాడగలిగే ఈ దుబాయ్ యువరాణి.. అంతర్జాతీయంగా జరిగే సదస్సులు, సమావేశాల్లో దుబాయ్ తరఫున పాల్గొని ఆయా అంశాలపై ప్రసంగిస్తుంటుంది.
- ప్రయాణాలంటే షైకాకు చాలా ఇష్టమట! ఈ మక్కువతోనే తాను పర్యటించే ప్రాంతాల్ని ఫొటోల్లో బంధిస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుందీ బ్యూటీ.
- ఫిట్‌నెస్, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. తాను పాటించే జీవనశైలి సూత్రాల్నీ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుంది. తద్వారా వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతుంటుంది.
వెదురు కర్రలతో ప్రాక్టీస్ నుంచి పారిస్ వరకు- ఒలింపిక్స్‌లో 'ఆమె'పైనే ఆశలన్నీ! - Paris olympics 2024
చదువుల తల్లి విజయలక్ష్మి విజయగాథ మీకు తెలుసా..?