Why Lord Shiva Wear Skulls Garland :మనం ఆ మహాశివుడి విగ్రహాన్ని గమనిస్తే అందరి దేవుళ్ల మాదిరిగా, ఆయన ఒంటిపై ఆభరణాలు కనిపించవు. ఒంటి మీద పులి చర్మం, మెడలో పాము, కొన్ని సందర్భాల్లో పుర్రెల దండ ధరించి కనిపిస్తాడు. అలాగే, స్వామి శ్మశానాలలో తిరుగుతుంటాడని, చితాభస్మాన్ని ధరిస్తుంటాడని చాలా పురాణాల్లో మనకు కనిపిస్తుంటుంది. అందుకే, చాలా మందిలో ఇదంతా మంగళ విరుద్ధమైనది కదా అనే భావన కలుగుతుంటుంది. మరి, మంగళానికే మంగళకరుడైన దేవుడు ఎందుకలా ఉండాల్సి వచ్చింది? దాని వెనుక దాగి ఉన్న ఆంతర్యమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పద్మపురాణం ఉత్తరఖండం నలభై ఒకటో అధ్యాయంలో ఇందుకు సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. కథాసారానికి వస్తే పరమేశ్వరుడిని పార్వతీదేవి ఓసారి ఇలా ప్రశ్నించింది. 'స్వామీ! శ్మశానంలో తిరగటం, పుర్రెలు, ఎముకలు మాలలుగా ధరించి బూడిద రాసుకొని ఉండటం ఇవన్నీ అశుచికి లక్షణాలు. అలాంటి వాటిని మీరు ఎందుకు ధరిస్తున్నట్టు అని అడిగింది. అప్పుడు శివుడుతాను అలా ఉండటం వెనక జరిగిన ఓ సంఘటనను వివరించాడు.
పూర్వం దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరుగుతుండేది. రాక్షసులు ఎప్పుడూ దేవతలను బాధిస్తూనే ఉండేవారు. అందుకు కారణం బ్రహ్మాది దేవతలను రాక్షసులు ఘోర తపస్సు చేసి మెప్పించి వరాలను పొందటమేనట. ఆ రాక్షసుల తపస్సుకు దేవతలు వరాలను ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఉండేది. ఆ వర ప్రభావంతో దానవులు విర్రవీగుతూ దేవతలను విపరీతంగా ఇబ్బందిపెడుతుండేవారు. ఒకసారి ఇంద్రాదులంతా ఆ బాధను తట్టుకోలేక వైకుంఠానికి చేరి శ్రీమహావిష్ణువునుశరణువేడారు. అప్పుడు విష్ణువు కాసేపు ఆలోచించి ఈశ్వరుడిని పిలిచాడు.
విష్ణుమూర్తే కాదు, శివుడు కూడా 10 అవతారాలు ఎత్తారు- వాటి గురించి తెలుసా?
రాక్షసులు అందరూ తపస్సు చేసి వరాలను పొందుతున్నది ధర్మమార్గంలో నడుచుకునే దేవతలను బాధించటానికే. అలాంటి వారికి మంచి జరగకుండా వారంతా నరకానికే వెళ్లే ఓ ఉపాయం ఉందని దాన్ని శ్రద్ధగా వినమని చెప్పాడు. ఓ రకంగా రాక్షసులు చేస్తున్నది మోసమే. అందుకే వారిని ఏదో విధంగా మోహపరిచి మోసంతోనే వారి బాధ నుంచి దేవతలకు విముక్తి కలిగించాలన్నాడు. కాబట్టి, వెంటనే అపవిత్రాలైన పుర్రెలు, ఎముకలు వంటి వాటిని మెడలో ధరించి బూడిద రాసుకొని ఆ రాక్షసుల దగ్గరకు వెళ్లి ఆ వేషంతో వారిని ఆకర్షించమని విష్ణువు శివయ్యతో చెప్పాడు. వేదనింద, దైవనింద, సత్కార్య విముఖత లాంటి వాటిని వారిలో కలిగించమని, అలా చేస్తే ఆ రాక్షసులు పాపాసక్తులై ప్రవర్తించి నాశనమవుతారని శ్రీమహావిష్ణువు శివుడికి ఒక ఉపాయం చెప్పాడు.
రామ మంత్ర ప్రభావంతో
ఆ సమయంలో శివుడికి తాను అపవిత్ర వస్తువులను ధరించటం, అపవిత్ర కార్యాలను చేయటంవల్ల పాపిగా మారిపోతే తన పరిస్థితి ఏమిటని మనసులో ఓ సందేహం కలిగింది. ఆ సందేహాన్ని వెంటనే శ్రీమహావిష్ణువుకు చెప్పాడు శివయ్య. అప్పుడు విష్ణువు ఓ సలహా ఇచ్చాడు. శ్రీరామాయనమః అనే ఆరు అక్షరాల మంత్రం ఒకటుంది. సీతావల్లభుడైన శ్రీరామచంద్రుడినిస్మరించి ఆ మంత్రాన్ని జపిస్తే సన్మార్గులెవారికైనా ఎలాంటి పాపమూ అంటబోదని అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు వెంటనే మహావిష్ణువు చెప్పినట్టుగా వేషధారణ చేసుకొని రాక్షసుల దగ్గరకు వెళ్లి విచిత్ర వేషంతో వారందరినీ ఆకట్టుకున్నాడు. పాషండ మతవిధానాన్ని(నాస్తిక మతవిధానం) ఉపదేశించాడు. దాంతో దైవనింద, వేదనింద లాంటివన్నీ రాక్షసులకు అలవాటు అయ్యాయి.
గతంలో ఎప్పుడైనా దేవతల మీదకు రాక్షసులు యుద్ధానికి వెళ్లి గెలిచినా, మళ్లీ ఏ బ్రహ్మదేవుడి గురించో తపస్సు చేస్తే పాపాలన్నీ హరించి పోతుండేవి. పాషండ మతాన్ని (నాస్తిక) అవలంబించిన దగ్గర నుంచి రాక్షసులకు ఏ విధమైన దైవ సహకారమూ లభించటం లేదు. దాంతో తేజస్సంతా క్షీణించి రాక్షసులు నశించసాగారు. ఈ విషయాన్నంతా పరమేశ్వరుడు పార్వతిదేవికి వివరించి శ్రీమహావిష్ణువు ఆజ్ఞానుసారం శిష్టరక్షణ కోసమే తానలా భస్మ, అస్తిధారణ చేస్తూ బూడిద పూసుకొని శ్మశానంలో తిరుగుతూ ఉంటున్నట్టు తెలియజేశాడు.
భూమ్మీద శివుడు నాట్యం చేసిన 5 ప్రాంతాలివే - మనకు సమీపంలోనే ఉన్నాయి!