How to Make Keera Dosakaya Pachadi : చాలా మంది రోటి పచ్చళ్లను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, మీరు ఇప్పటి వరకు టమాటా, దొండకాయ, బీరకాయ, దోసకాయ.. వంటి రకరకాల చట్నీలను ప్రిపేర్ చేసుకుని ఉంటారు. కానీ.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కీరదోసతో ఎప్పుడైనా పచ్చడిని ట్రై చేశారా? లేదంటే ఇప్పుడే ఓసారి ప్రయత్నించి చూడండి. దీని భిన్నమైన రుచి మిమ్మల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. పైగా ఈ పచ్చడిని చాలా తక్కువ టైమ్‌లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు.. కీరా ముక్కలుగా వద్దనే పిల్లలు ఈ రూపంలో ఇష్టంగా తింటారట! మరి, ఆలస్యమెందుకు ఈ సూపర్ టేస్టీ, హెల్దీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- కీర దోసకాయలు - 3
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- ధనియాలు - 1 టేబుల్‌స్పూన్
- జీలకర్ర - అర టేబుల్‌స్పూన్
- తెల్ల నువ్వులు - 2 టేబుల్‌స్పూన్లు
- ఎండుమిర్చి - 10
- టమాటాలు - 2(పండినవి)
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - నిమ్మకాయ సైజంత
- వెల్లుల్లి రెబ్బలు - 5
- ఉల్లిపాయ - 1
తాలింపు కోసం :
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- పోపు దినుసులు - 1 టేబుల్ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 7
- ఎండుమిర్చి - 4
- ఇంగువ - చిటికెడు
- కరివేపాకు - 3 రెమ్మలు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా కీరదోసకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే.. రెసిపీలోకి కావాల్సిన టమాటాలనూకట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై.. కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కాక.. ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు, ఎండుమిర్చి వేసుకోవాలి.
- ఆపై స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఆ మిశ్రమం కాస్త రంగు మారేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం మళ్లీ అదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీరదోస, టమాటా ముక్కలతో పాటు ఉప్పు వేసుకోవాలి.
- తర్వాత స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ ముక్కలన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి.
- అలా వేయించుకునేటప్పుడే చింతపండునూ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవసరమైతే అడుగు మాడుతుందనిపిస్తే.. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి.
- ఎప్పుడైతే ముక్కలన్నీ మంచిగా వేగి ఉడికాయనిపిస్తుందో అప్పుడు స్టౌ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని కాస్త చల్లార్చుకోవాలి.
రొటీన్ కూరలు తిని నోరు చప్పగా తయారైందా? - ఇలా "పచ్చిమిర్చి బండ పచ్చడి" ట్రై చేయండి - చాలా టేస్టీ!
- ఇప్పుడు రోలును శుభ్రంగా కడిగి క్లాత్‌తో తుడుచుకున్నాక.. ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
- ఆవిధంగా రుబ్బుకున్నాక.. అందులో వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఉప్పు, ఉడికించి పెట్టుకున్న కీరదోస మిశ్రమాన్ని వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలా గరిటెతో కలుపుకోవాలి.
- ఆ తర్వాత మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఆవిధంగా దంచుకున్నాక.. ఉల్లిపాయను రెండు భాగాలుగా కట్ చేసి వేసుకొని ఆనియన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
- అలా ఉల్లిపాయను దంచుకున్నాక.. మరోసారి పచ్చడిని బాగా రుబ్బుకోవాలి. ఎంత బాగా రుబ్బుకుంటే అందులో నుంచి అంత నీరు బయటకు వస్తుంది. ఎందుకంటే.. కీరదోసలోవాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
- అయితే, రోలు అందుబాటులో లేని వారు సేమ్ ఇదే ప్రాసెస్‌లో మిక్సీలోనూ ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే రోట్లో రుబ్బుకున్న టేస్ట్ మిక్సీలో రాదనే విషయాన్ని గమనించాలి.
- ఆవిధంగా రుబ్బుకున్నాక.. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. పోపు దినుసులు, కాస్త దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చిని తుంపి వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఇంగువ, కరివేపాకు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆపై ముందుగా రుబ్బి పెట్టుకున్న కీరదోస మిశ్రమాన్ని తాలింపులో వేసుకొని కలిపి స్టౌ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "కీరదోస పచ్చడి" రెడీ!
నోరూరించే "బీరకాయ టమాట పచ్చడి" - ఇలా ప్రిపేర్ చేస్తే రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!