Egg French Fries Recipe in Telugu : ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరిపోతుంది. ఆలూతో ప్రిపేర్ చేసుకునే వీటిని వయసుతో ప్రమేయం లేకుండా అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఎప్పుడూ రొటీన్‌గా బంగాళదుంపలతోనే కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయండి. అదే, "ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్". ఇవి కూడా చాలా రుచికరంగా ఉంటాయి. గుడ్డుతో ప్రిపేర్ చేసేవి కాబట్టి వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుని మరీ తింటారు! పైగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంతకీ, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- ఎగ్స్ - 3 నుంచి 4
- బంగాళ దుంపలు - 3(మీడియం సైజ్‌వి)
- ఉప్పు - రుచికి సరిపడా
- గరంమసాలా - కొద్దిగా
- కారం - తగినంత
- చిల్లీ ఫ్లేక్స్ - 2 టేబుల్‌స్పూన్లు
- డీప్ ఫ్రైకి సరిపడా - నూనె
- బ్రెడ్ క్రంబ్స్ - కొద్దిగా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బంగాళదుంపలను పొట్టు తీసుకోవాలి. ఆపై వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ మాదిరిగా సన్నని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆ ముక్కలను సగం వరకు ఉడికించుకోవాలి.
- ఆ విధంగా ఉడికించుకున్నాక వాటిని ఒక బౌల్లో ఉప్పు నీటిని తీసుకొని అందులో వేసి గంట పాటు నాననివ్వాలి.
- ఇక్కడ బంగాళదుంప ముక్కలను ముందుగా ఉడికించి నానబెట్టుకోవడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. పైగా ఎగ్ కోటింగ్ మాడకుండా ఉంటుందని గుర్తుంచుకోవాలి.
- ఈలోపు రెసిపీలోకి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా ఒక చిన్న బౌల్లో ఎగ్స్‌ని పగులకొట్టి పోసుకోవాలి. ఆపై అందులో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక ప్లేట్లో బ్రెడ్ క్రంబ్స్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి.
- గంట తర్వాత నానబెట్టుకున్న ఆలూ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిపై గరంమసాలా, ఉప్పు, కారం, చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆలూ ముక్కలను ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి ఆ తర్వాత బ్రేడ్ క్రంబ్స్తో కోట్ చేసుకొని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి.
- అనంతరం వాటిని క్రిస్పీగా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆపై తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్" రెడీ!
- ఇక వీటిని టమటా సాస్‌తో ముంచుకొని తింటుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది! మరి, నచ్చిందా అయితే మీరూ ఓసారి ఇలా ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ట్రై చేయండి.
ఇవీ చదవండి :