How to Make Crispy Potato Fry: మెజార్టీ పీపుల్ ఇష్టపడే కూరగాయలలో ఒకటి.. బంగాళదుంప. దీనితో కర్రీ, ఫ్రై, కుర్మా, ఆలూ రైస్, వడ వంటి రకరకాల వంటకాలు ట్రై చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ఎక్కువ మంది ఫ్రైని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లో ఎన్నో సార్లు ఆలూ ఫ్రైని ట్రై చేస్తారు. కానీ.. క్రిస్పీగా, టేస్టీగా రాదు. అలాంటి వారు ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్దిరిపోతుంది! ఇంతకీ.. క్రిస్పీ క్రిస్పీగా ఉండే 'ఆలూ ఫ్రై'ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బంగాళ దుంపలు - 300 గ్రాములు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- పోపు దినుసులు - 1 టీస్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- ఎండుమిర్చి - 2
- వెల్లుల్లి రెబ్బలు - 8 నుంచి 10
- పసుపు - పావు టీస్పూన్
- కారం - తగినంత
- ఉప్పు - కొద్దిగా
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- మిరియాల పొడి - పావు టీస్పూన్
- జీలకర్ర పొడి - పావు టీస్పూన్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బంగాళదుంపల పైపొట్టు తీసుకోవాలి. తర్వాత వాటిని వేగడానికి వీలుగా ఉండేలా చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- అనంతరం వాటిని ఒక బౌల్లోకి తీసుకొని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
- తర్వాత మరోసారి ఆ బౌల్లో వాటర్ నింపి కొద్దిగా ఉప్పు వేసి బంగాళ దుంపలను వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆలుగడ్డ ముక్కలు రంగు మారవు.
- అనంతరం ఆ ముక్కలను కాసేపు జల్లిగిన్నెలో వాటర్ పోయేంత వరకు ఉంచాలి.
- ఇప్పుడు స్టౌపై.. పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి.
- ఆపై మంటను లో టూ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆలుగడ్డ ముక్కలన్నీ క్రిస్పీగా మారే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆవిధంగా ఫ్రై చేసుకున్నాక బంగాళదుంప ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం అదే పాన్‌లో తాలింపు కోసం.. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక.. పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి.
- ఆ తర్వాత కాస్త కచ్చపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరికాసేపు ఫ్రై చేసుకోవాలి.
- తాలింపు వేగాక.. అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఆపై మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి 2 నుంచి 3 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలి.
- అనంతరం మంటను లో ఫ్లేమ్‌లోకి తగ్గించుకొని ఆ మిశ్రమంలో పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆపై రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దించుకుంటే చాలు. అంతే.. క్రిస్పీగా, ఎంతో టేస్టీగా ఉండే "ఆలూ ఫ్రై" రెడీ!