How to Make Eggless Plum Cake at Home: క్రిస్మస్ మొదలు కొత్త సంవత్సరం ఆరంభం వరకూ ఎక్కడ చూసినా కేక్స్ హడావుడే ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి కేక్ కటింగ్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇక కేక్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. మరికొద్దిగంటల్లో క్రిస్మస్ సందడి మొదలు కాబోతుంది. ఇక ఈ పండగ వేళ బేకరీ వాళ్లు ఇష్టారీతిన రేట్లు పెంచడం, క్వాలిటీ పట్టించుకోకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. అందుకే.. ఈ పండగకు కేక్ బేకరీలో కొనడం కాకుండా.. ఇంట్లోనే ఈజీగా "ఎగ్‌లెస్ ప్లమ్ కేక్" ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అద్దిరిపోతుంది. మరి, ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
- ఆప్రికాట్స్ - 60 గ్రాములు
- చెర్రీలు - 100 గ్రాములు
- పండు ఖర్జూరాలు - 60 గ్రాములు
- క్రాన్బెర్రీస్ - 60 గ్రాములు
- టూటీ ఫ్రూటీ - పావు కప్పు
- నల్ల ఎండు ద్రాక్ష - 60 గ్రాములు
- ఎండు ద్రాక్ష - 60 గ్రాములు
- వాల్నట్స్ - 25 గ్రాములు
- జీడిపప్పు - 60 గ్రాములు
- బాదం - 50 గ్రాములు
- లవంగాలు - 7
- దాల్చిన చెక్క - కొద్దిగా
- జాపత్రి - కొద్దిగా
- శొంఠి - ముప్పావు ఇంచ్
- యాలకులు - 6
- జాజికాయ - కొద్దిగా
- టెట్రా ప్యాక్ ఆరెంజ్ జ్యూస్ - కప్పుంపావు
- బ్రౌన్ షుగర్ - పావు కప్పు
సిరప్ కోసం:
- పంచదార - 1కప్పు
- వేడి నీళ్లు - 1 కప్పు
- మైదా - 300 గ్రాములు
- బేకింగ్ పౌడర్ - ఒకటిన్నర టీ స్పూన్
- బేకింగ్ సోడా - 1 టీ స్పూన్
- ఉప్పు - కొద్దిగా
- కరిగించిన వెన్న - 200 గ్రాములు
- వెనీలా అసెన్స్ = 1 టీ స్పూన్
తయారీ విధానం:
- ముందుగా మిక్సీ జార్‌లోకి లవంగాలు, దాల్చినచెక్క, జాపత్రి, శొంఠి, యాలకులు, జాజికాయ వేసి మెత్తని పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు నట్ కట్టర్ సాయంతో ఓ బౌల్లోకి ఆప్రికాట్స్‌ను సమానంగా సన్నగా కట్ చేయాలి. అలాగే చెర్రీలు, పండు ఖర్జూరాలు కట్ చేయాలి. ఆ తర్వాత క్రాన్బెర్రీస్, టూటీ ఫ్రూటీ, నల్ల ఎండు ద్రాక్ష, ఎండు ద్రాక్ష వేసి పక్కన పెట్టాలి.
- మరో బౌల్లోకి వాల్నట్స్, బాదం, జీడిపప్పను సన్నగా కట్ చేసి పక్కన పెట్టాలి.
- ఆప్రికాట్స్ ఉన్న బౌల్లోకి టెట్రా ప్యాక్ ఆరెంజ్ జ్యూస్, గ్రైండ్ చేసుకున్న స్పైస్ మిక్స్ పౌడర్ ఒకటింపావు టీ స్పూన్, బ్రౌన్ షుగర్ వేసి కలిపి ఓ రెండు గంటల పాటు నానబెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి పంచదార వేసి మీడియం ఫ్లేమ్‌లో కరిగించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు పాకాన్ని మరిగించుకోవాలి. పాకం మరుగుతున్నప్పుడు వేడి నీళ్లు పోసి ఓ నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి.
- ఇప్పుడు ఓ బౌల్లోకి మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసేందుకు 8 ఇంచ్‌లు ఉన్న మౌల్డ్ తీసుకుని దాని లోపల బటర్ లేదా నూనె అప్లై చేయాలి. ఆ తర్వాత గిన్నె అడుగున బటర్ పేపర్ లేదా మైదా పిండి చల్లి మొత్తం స్ప్రెడ్ చేసి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని అందులోకి రెండు గంటలు నానబెట్టిన బెర్రీస్, కరిగించిన బటర్ వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత అందులోకి చల్లారిన కారామిల్ సిరప్, మైదా పిండిని వేసి కట్ అండ్ ఫోల్డ్ డైరెక్షన్లో కలుపుకోవాలి.
- ఇప్పుడు అందులోకి కట్ చేసిన బాదం, జీడిపప్పు, వాల్నట్స్ ముక్కలు వేసి వెనీలా అసెన్స్ వేసి మరోసారి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని కేక్ మౌల్డ్‌లోకి వేసి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ పైన మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి పక్కన పెట్టండి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా, వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టి అందులో ఓ స్టాండ్ పెట్టి మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత కేక్ మౌల్డ్‌ను స్టాండ్ మీద పెట్టి ప్రెజర్ బయటికి పోకుండా మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో సుమారు 40 నిమిషాలు బేక్ చేసుకోండి.
- 40 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయ్యిందో లేదో టూత్‌పిక్ సాయంతో చూసుకుని బేక్ కాకపోతే మరో 5 నుంచి 10 నిమిషాలు కేక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఆ కేక్ మౌల్డ్‌ను బయటికి తీసి ఓ క్లాత్ కప్పి సుమారు 2 గంటల సేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత మౌల్డ్ నుంచి సెపరేట్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే క్రిస్మస్ స్పెషల్ ఎగ్‌లెస్ ప్లమ్ కేక్ రెడీ. నచ్చితే మీరూ ఈ క్రిస్మస్కు ఇంట్లో ట్రై చేయండి.
ఎగ్, ఓవెన్ లేకుండానే - నోరూరించే "బ్లాక్ ఫారెస్ట్ కేక్" - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
బేకరీ కేక్‌తో అనారోగ్య భయమా? - "రాగి బెల్లం కేక్" ఇంట్లోనే ట్రై చేయండిలా!