How to Make Restaurant Style Chicken Sherva: చికెన్ షేర్వా పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక ఈ చలికాలంలో వేడివేడిగా తింటే వచ్చే కిక్కే వేరు. అయితే.. ఈ చికెన్ షేర్వా చేయాలంటే కష్టమనుకుంటారు చాలా మంది. కానీ సరైన విధానంలో వండితే తక్కువ సమయంలోనే రెస్టారెంట్ లాంటి షేర్వాను ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని చపాతీ, రోటీ, పరోటా, అట్టు, ఇడ్లీలతో తింటే ఆ రుచి వేరు పైగా కాస్త స్పైసీగా చేసుకుంటే ఘాటు నషాళానికి ఎక్కి జలుబు, దగ్గు పోవాల్సిందే. మరి ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
స్టాక్ కోసం:
- చికెన్ విత్ బోన్స్ - పావు కిలో
- క్యాప్సికం ముక్కలు - పావు కప్పు
- ఉల్లిపాయ - 1
- బిర్యానీ ఆకు - ఒకటి
- మిరియాలు - ఒక స్పూను
- క్యారెట్ ముక్కలు - అరకప్పు
- నీళ్లు - ఒకటిన్నర కప్పు
మసాలా పేస్ట్ కోసం:
- వేరుశనగ పలుకులు - పావు కప్పు
- గసగసాలు - 1 టీ స్పూన్
- సోంపు - 1 టీ స్పూన్
- పచ్చి కొబ్బరి ముక్కలు - అర కప్పు
షేర్వా కోసం:
- నూనె - సరిపడినంతా
- అనాస పువ్వు - 1
- లవంగాలు - 4
- దాల్చినచెక్క - ఇంచ్
- దంచిన యాలకులు - 3
- బిర్యానీ ఆకు - 1
- ఉల్లిపాయలు - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
- చికెన్ విత్ బోన్స్ - 350 గ్రాములు
- టమాటలు - 2
- పచ్చిమిర్చి - 3
- పసుపు - పావు టీ స్పూన్
- ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
- కారం - రెండున్నర టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- పుదీనా ఆకులు - 10
- చికెన్ మసాలా - 1 టీ స్పూన్
- తయారీ విధానం:
చికెన్ షేర్వా రెసిపీ:
- చికెన్ షేర్వా చేయడానికి ముందుగా చికెన్ స్టాక్‌ను ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో చికెన్ ముక్కలు, మిరియాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయల తరుగు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి నీళ్లు పోసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో గంట పాటు మరిగించండి. ఆ తర్వాత ఉడికిన చికెన్, కూరగాయ ముక్కలు తీసి పక్కన పెట్టి.. సూప్‌ను అలానే ఉంచండి.
- ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పల్లీలు, గసగసాలు వేసి వేయించండి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి, పచ్చి కొబ్బరి ముక్కలు, సోంపు వేసి తగినంత నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి అనాసపువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, దంచిన యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించండి.
- ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోండి.
- తర్వాత అందులోనే కొత్తిమీర తరుగును మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేసి పచ్చి వాసన పోయేంతవరకు మగ్గించుకోవాలి.
- అనంతరం చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి అందులోని నీరు ఇంకి చికెన్ ముక్కపై లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి టమాట ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు, ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి..
- ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ స్టాక్‌ను పోసుకోవాలి. ఓ సారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి. సుమారు 20 నిమిషాలు పడుతుంది.
- ఆ తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పల్లీల పేస్టును వేసి కలపాలి. ఆ తర్వాత పుదీనా ఆకులు వేసి లోఫ్లేమ్ మీద నూనె పైకి తేలే వరకు పది నిమిషాలు ఉడికించాలి.
- ఆ తర్వాత చికెన్ మసాలా వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. అంతే ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ చికెన్ షేర్వా రెడీ. ఇడ్లీ, దోశ, పూరీ, చపాతీ, పరోటా ఇందులో తిన్నా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.
ఈ చలిలో మటన్ పాయా.. సూప్ జుర్రేస్తే జిందగీ ఖుష్ అవ్వాల్సిందే!
కూల్ వెదర్లో హాట్ హాట్‌గా "మిక్స్డ్ వెజ్ బాదం సూప్" - ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ - పైగా ఆరోగ్యం బోనస్!