Tourist Places in Hyderabad : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ముందు వరసలో ఉంటుంది. పిల్లలకు సెలవులు, ఇంటిల్లిపాదీ ఒక్కచోట చేరే సంబరం కావడంతో ఈ పండక్కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే, హైదరాబాద్ నుంచి లక్షలాది మంది జనం సొంత ఊరు బాటపడతారు. బంధుమిత్రులతో కలిసి సంబరాలు చేసుకొని తిరిగి వస్తారు. అయితే, అనివార్య కారణాలతో కొందరు ఊళ్లకు వెళ్లలేరు. సెలవులు తక్కువగా ఉండడం కావొచ్చు, మరేదైనా కారణం కావొచ్చు. ఇలాంటి వారు హైదరాబాద్లోనే హాలీడేను ప్లాన్ చేసుకోవచ్చు. సంక్రాంతి సంబరాలు ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరి, నగరం చుట్టుపక్కల ఎన్ని హాలీడే స్పాట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
నగరంలో ఎన్నో చారిత్రక, సుందర ప్రదేశాలు ఉన్నాయి. హైదరాబాద్ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రాంతాల్లో గోల్కొండ కోట ప్రముఖమైనది. ఏళ్ల తరబడి భాగ్యనగరంలో నివసిస్తున్నా కూడా, వాయిదాలు వేస్తూ ఇప్పటి వరకు గోల్కొండ కోట చూడని వారు ఎందరో ఉంటారు. అలాంటి వారు ఈ సెలవుల్లో చూసిరండి. సంక్రాంతి వేళ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
ఏనుగు చెట్టును చూడండి :
గోల్కొండ కోట బయట గోల్కొండ గవర్నమెంట్ స్కూలు దగ్గరలో ఓ పెద్ద "ఏనుగు చెట్టు" ఉంది. అక్కడివారు దాన్ని "హాతీ కా పేడ్" అంటారు. అది ఎంతపెద్దదంటే, దాని మొదలు సుమారు 25 అడుగుల వ్యాసం ఉంటుంది. ఆ చెట్టు మొదట్లో పెద్ద తొర్ర ఉంటుంది. ఈ తొర్రకు ఓ కథ కూడా ఉంది. ఆ రోజుల్లో దొంగలు రాత్రిళ్ళు చోరీలు చేసి, ఆ తొర్రలోనే దాక్కునేవాళ్లని అంటారు. ఈ చెట్టు వయసు వందల ఏళ్లు ఉంటుందని భావిస్తారు. మీరు గనక వెళ్తే తప్పక చూడండి.
జూ పార్కు :
పిల్లలు, పెద్దలు అనే తేడాలేకుండా ప్రతిఒక్కరూ సందర్శించాల్సిన మరొక ప్రదేశం నెహ్రూ జూ పార్కు. అడువులకే పరిమితమైన ఎన్నో జంతువులను ఇక్కడ చూడొచ్చు. వందలాది ఎకరాల్లో విస్తరించిన ఈ పార్కు మొత్తం కలియతిరగడానికి ఒక రోజు మొత్తం కేటాయించుకోవచ్చు.
ఆకాశపురి హనుమాన్ మందిరం :
దత్తాత్రేయ నగర్ లో ఉందీ మందిరం. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మెహదీపట్నం నుండి సుమారు 6 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రతిష్ఠించిన ఆంజనేయుడి విగ్రహం ఎత్తు ఏకంగా 51 అడుగులు. హైదరాబాద్లోని హునుమాన్ ఆలయాల్లో ఈ విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది.