Brinjal Tawa Fry Recipe in Telugu :కార్తికమాసంలో చాలా మంది ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉంటారు. అలాంటి వారు అవి లేకుండా ఏదైనా రుచికరమైన కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఓసారి ఈ అద్దిరిపోయే ఫ్రై రెసిపీని ట్రై చేయండి. అదే.. "వంకాయ తవా ఫ్రై". అలాగే, ఇంట్లో సాంబార్, రసం చేసుకున్నప్పుడు అందులోకి సైడ్ డిష్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడూ దీన్ని చేసుకోండి. కాంబినేషన్ సూపర్ ఉంటుంది! అందరూ చాలా ఇష్టంగా తింటారు. పైగా ఈ రెసిపీని చాలా తక్కువ సమయంలో సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- గుత్తొంకాయలు - 2(మీడియం సైజ్‌వి)
- నూనె - తగినంత
- శనగపిండి - పావు కప్పు
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్‌స్పూన్లు
- కారం - తగినంత
- పసుపు - అరటీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- జీలకర్ర పొడి - పావుటీస్పూన్
- ఆమ్చూర్ పౌడర్ - పావుటీస్పూన్
- గరంమసాలా పౌడర్ - అరటీస్పూన్
- ఇంగువ - కొద్దిగా
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
చూస్తేనే నోరూరిపోయే "వంకాయ పచ్చడి" - ఈ కొలతలతో చేసుకున్నారంటే అద్భుతః అనాల్సిందే!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా పర్పుల్ కలర్లో ఉండే మీడియం సైజ్ గుత్తొంకాయలనుతీసుకొని శుభ్రంగా కడిగి పావు ఇంచు మందంతో సన్నని స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.
- తర్వాత కట్ చేసుకున్న ఆ ముక్కలన్నింటినీ ఒక బౌల్లో ఉప్పు వేసిన నీటిలో వేసుకొని 5 నిమిషాల పాటు నాననివ్వాలి.
- ఈలోపు రెసిపీలోకి కావాల్సిన మసాలా మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కార్న్‌ఫ్లోర్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్, గరంమసాలా పౌడర్, ఇంగువ, ఉప్పు.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా చేతితో బాగా కలుపుకోవాలి.
- అనంతరం ఉప్పు నీటిలో నానబెట్టుకున్న ఒక వంకాయ స్లైస్‌ని తీసుకొని వాటర్ లేకుండా కాస్త దులిపి మీరు ప్రిపేర్ చేసుకున్న మసాలా పిండి మిశ్రమంలో వేసి దానికి రెండు వైపులా పిండి అంటేంత వరకు చక్కగా కోట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలన్నింటినీ పిండిలో మంచిగా కోట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు వాటిని షాలో ఫ్రై చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై తవా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త హీట్ అయ్యాక పాన్‌లో సరిపోయే విధంగా నాలుగు లేదా ఐదు కోట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి.
- ఆపై స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వాటిపై క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు గరిటెతో టర్న్ చేసుకుంటూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు.
- ఇక చివరగా వంకాయ ముక్కలు రెండు వైపులా చక్కగా వేగాయనుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతోగార్నిష్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "వంకాయ తవా ఫ్రై" రెడీ!
వంకాయ పచ్చి కారం - రొటీన్‌గా కాకుండా వెరైటీగా చేసుకోండిలా!