Telangana Style Chepala Pulusu Recipe : చాలా మందికి చేపల కూరంటే నోరూరిపోతుంది. కానీ, పర్ఫెక్ట్ టేస్ట్‌తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్కువ మందికి తెలియదు. అలాంటి వారికోసమే "తెలంగాణ స్టైల్ చేపల పులుసు" రెసిపీ తీసుకొచ్చాం. ఈ స్టైల్లో ఒక్కసారి చేశారంటే ఎప్పుడూ ఇదే తీరును ఫాలో అవుతారు. అంత రుచికరంగా ఉంటుంది! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
మారినేషన్ కోసం :
- బొచ్చ చేప ముక్కలు - 1 కేజీ
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
- పసుపు - 1 టీస్పూన్
- ఉప్పు - 1 టీస్పూన్
కర్రీ కోసం :
- చింతపండు - 60 గ్రాములు
- నూనె - పావు కప్పు
- కరివేపాకు - 4 రెమ్మలు
- దాల్చిన చెక్క - 2 చిన్న ముక్కలు
- ఉల్లిపాయలు - 4(మీడియం సైజ్‌వి)
- కారం - రుచికి సరిపడా
- ఉప్పు - తగినంత
మసాలా పొడి కోసం :
- మెంతులు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
- ధనియాలు - 2 టీస్పూన్లు
- యాలకులు - 4
- మిరియాలు - అరటీస్పూన్
- లవంగాలు - 7
- ఎండుకొబ్బరి ముక్కలు - పావు కప్పు
- వాము - 2 చిటికెళ్లు
- గసగసాలు - 1 టేబుల్‌స్పూన్
నోరూరించే చింతకాయ "చేపల వేపుడు" - ఇలా చేస్తే ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి వేడి నీళ్ల పోసి వేసి నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన చేప ముక్కలను తీసుకొని అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి అన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి.
- అనంతరం స్టౌపై గ్రిల్ ఉంచి దానిపై పొట్టు తీయని ఉల్లిపాయలను పెట్టి మీడియం ఫ్లేమ్ మీద అన్నీ వైపులా చక్కగా మగ్గే వరకు తిప్పుతూ నెమ్మదిగా కాల్చుకోవాలి. ఇందుకోసం పావుగంట వరకు టైమ్ పట్టొచ్చు.
- ఆ విధంగా కాల్చుకున్నాక వాటిపై మరీ నల్లగా మారిన పొట్టును కొంత వరకు తీసేయాలి. అనంతరం ఉల్లిపాయలను మిక్సీ జార్లో వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని అందులో మెంతులు, జీలకర్ర, దాల్చిన చెక్క, ధనియాలు, యాలకులు, మిరియాలు, లవంగాలు, సన్నగా కట్ చేసుకున్న ఎండుకొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఆపై లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు మసాలా దినుసుల్ని వేయించుకోవాలి.
- అయితే, అవి కాస్త వేగాక అందులో వామును యాడ్ చేసుకొని వేయించుకోవాలని గుర్తుంచుకోవాలి. మసాలాలు బాగా వేగాక స్టౌ ఆఫ్ చేసుకొని గసగసాలు వేసుకుంటే ఆ వేడికి అవీ చక్కగా వేగుతాయి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన మసాలా దినుసుల్ని వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
- ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చిక్కని గుజ్జు తీసుకోవాలి. ఆపై అందులో గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, కారం, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఓసారి ఇలా "చేపల ఫ్రై" చేసి చూడండి - తక్కువ సమయంలో అదుర్స్ అనిపించే టేస్ట్!
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న చింతపండు మిశ్రమం వేసి మీడియం ఫ్లేమ్ మీద పులుసులో నుంచి నూనె సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
- ఆ విధంగా ఉడికించుకున్నాక అందులో 1 లీటర్ వరకు వేడినీరు, గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసి కలిపి మూతపెట్టి హై ఫ్లేమ్ మీద మరో 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
- అనంతరం మారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఉడుకుతున్న పులుసులో సర్ది మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందుకోసం కనీసం 25 నిమిషాల వరకు సమయం పట్టొచ్చు.
- ముక్క నిదానంగా పులుసులో ఉడికితేనే కర్రీ చాలా రుచికరంగా ఉండి కనీసం మూడు రోజులు పాడవ్వకుండా ఉంటుంది.
- ఆ విధంగా ఉడికించుకున్నాక చివర్లో కొత్తిమీర తరుగు వేసి పాన్ హ్యాండిల్స్ పట్టుకొని అటూ ఇటూ కదిలించి స్టౌ ఆఫ్ చేసి ఒక గంటపాటు అలా వదిలేయండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "తెలంగాణ స్టైల్ చేపల పులుసు" రెడీ!
- మరి, నచ్చిందా అయితే మీరూ ఓసారి ఇలా చేపల పులుసు పెట్టండి. ఇంటిల్లిపాదీ ఈ రుచికి ఫిదా అయిపోతారంతే!
ట్రెండింగ్ 'నెల్లూరు చేపల పులుసు' - ఎలా చేయాలో మీకు తెలుసా?