తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మహిళలకు ప్రభుత్వ రుణం - 10 వేల నుంచి రూ.20 లక్షల దాకా - మార్చి 31 చివరి తేదీ! - AP GOVERNMENT 100 DAYS SCHEME

- మహిళల ఆదాయం పెంపుపై సర్కారు దృష్టి - వంద రోజుల ప్రత్యేక కార్యక్రమం

AP Government 100 Days Scheme
AP Government 100 Days Scheme (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2025, 3:56 PM IST

Mudra loans : స్త్రీలు స్వయం సమృద్ధి సాధించాలంటే, కచ్చితంగా ఆర్థికంగా ఎదగాల్సి ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్​లోని కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్) పరిధిలో వంద రోజుల కార్యక్రమం అమలు చేస్తోంది.

గతేడాది డిసెంబర్ 22న మొదలైన ఈ కార్యక్రమం, మార్చి 31తో ముగియనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వృత్తులు, వ్యాపారాలు చేసుకునే మహిళలకు పెట్టుబడి అవసరాల నిమిత్తం రుణాలు మంజూరు చేస్తుంది. మరి, ఏయే రంగాల్లోని మహిళలు రుణం ఇస్తారు? ఎంతెంత రుణం అందుతుంది? వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.

వారికోసం "పీఎం స్వనిధి"

పట్టణాలు, నగరాల్లో వీధి వ్యాపారులు ఎన్నో అవస్థలు పడుతుంటారు. ఎండా, వానకు ఇబ్బందులు పడుతూ వ్యాపారం చేయడం ఒకెత్తయితే, పెట్టుబడి కోసం పడే తిప్పలు మరో ఎత్తు. చాలా మంది డైలీ ఫైనాన్స్ నడిపేవారి వద్ద అప్పు తీసుకుంటూ ఉంటారు. రోజూ 500 రూపాయల నుంచి రూ.2వేల దాకా ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తీసుకుంటూ ఏకంగా 10 రూపాయల వడ్డీ చొప్పున తిరిగి చెల్లిస్తుంటారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ఉద్దేశించినదే "పీఎం స్వనిధి". ఈ స్కీమ్ ద్వారా జీవీఎంసీ పరిధిలో బ్యాంకు లింకేజీ రుణం అందిస్తున్నారు. ఈ పథకం కింద వీధి వ్యాపారులు రూ.10 వేల రుణం పొందొచ్చు. నిబంధనల ప్రకారం రుణం తీర్చిన తర్వాత, మళ్లీ తీసుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లైనా రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. వడ్డీ చెల్లింపుల్లో రాయితీని కూడా అందిస్తున్నారు.

"ముద్ర" రుణాలు :

మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో అద్భుతమైన రుణ పథకమే "మైక్రో యూనిట్స్‌ డెవలప్‌మెంట అండ్‌ రీ ఫైనాన్స్‌ ఏజెన్సీ (ముద్ర)". ఈ పథకం ద్వారా భారీ మొత్తంలో మహిళా వ్యాపారులు రుణం తీసుకోవచ్చు. ఉదాహరణకు టైలరింగ్ షాప్ నడిపేవారు, మగ్గం నిర్వహించేవారు, ఇళ్లలోని కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న దుకాణాలు నిర్వహించుకునే వారికి బ్యాంకులు "ముద్ర" పథకం ద్వారా రుణాలు అందిస్తాయి. ఈ రుణం రూ.50వేల నుంచి, వ్యాపారం స్థాయిని బట్టి రూ.20లక్షల వరకు కూడా అందుకునే వీలుంది. ఈ రుణం తిరిగి చెల్లించిన తర్వాత, అవసరాన్ని బట్టి మళ్లీ రుణం పొందవచ్చు. ఇలా ఎన్నిసార్లైనా రుణం తీసుకునే అవకాశం ఉంది.

పీఎం విశ్వకర్మ:

చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు నడిపేవారికి, ప్రధానంగా చేతి వృత్తిదారులకు పెట్టుబడిని సమకూర్చేందుకు ఉద్దేశించిన పథకం "పీఎం విశ్వకర్మ". ఈ స్కీమ్​ కింద రూ.లక్ష నుంచి 3లక్షల వరకు రుణం అందిస్తున్నారు.

పీఎంఈజీపీ స్కీమ్ :

ఆసక్తి ఉన్న ఏదైనా చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు ఈ "ప్రైమ్‌ మినిస్టర్‌ ఎంప్లాయిమెంట జనరేషన్‌ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) స్కీమ్ రూపొదించారు. అల్యూమినియం వస్తువులు, AC యంత్రాల విడిభాగాలకు చెందిన వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. తయారీ రంగంలో ఇంట్రస్ట్​ ఉంటే, ఈ స్కీమ్ ద్వారా 5లక్షల రూపాయల నుంచి 20లక్షల దాకా రుణం పొందొచ్చు.

ABOUT THE AUTHOR

...view details