Moringa Ladoo Making Process :రోజురోజుకు మారుతున్న జీవనశైలితో పాటుగా ఆహారపుటలవాట్లు, కాలుష్యం కారణంగా చాలామంది మహిళల్లో జుట్టు రాలడం, గోళ్లు పొడిబారడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే, కొంతమంది ఆరోగ్యపరమైన, జన్యుపరమైన కారణాలతో ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి సమస్యలకు సహజసిద్ధమైన పదార్థాలతోనే చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పోషకాహార నిపుణురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ 'సిమ్రత్ కథూరియా' మునగాకుతో చేసిన లడ్డును తినడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చని చెబుతున్నారు. ఈ లడ్డు జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లక్షల కొద్దీ వ్యూస్‌ని సొంతం చేసుకున్న ఈ లడ్డూ తయారీ గురించిన వివరాలు ఇప్పుడు మీ కోసం.
లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు :
- గుమ్మడి గింజలు - 1/3 కప్పు
- పిస్తా గింజలు - 1/3 కప్పు
- కొబ్బరి పొడి - 2/3 కప్పు
- మునగాకు పొడి - 2 టేబుల్ స్పూన్లు
- యాలకులు - మూడు
- కిస్‌మిస్ - 3/4 కప్పు
తయారీ :
మొదట ఒక కడాయి తీసుకోవాలి. అందులో కొబ్బరి పొడి, పిస్తా గింజలు, గుమ్మడి గింజలు వేసి వాటిని దోరగా వేయించాలి. అనంతరం కిస్‌మిస్‌ని కూడా దోరగా వేయించుకోవాలి. వీటన్నింటిని మిక్సీ బౌల్‌లోకి తీసుకుని మునగాకు పొడితో పాటుగా యాలకులను జత చేసి మిక్సీ పట్టుకోవాలి. అలా వచ్చిన మిశ్రమాన్ని ఉండల్లా చేసుకుంటే లడ్డూలు రడీ అయినట్లే. ఈ లడ్డుని రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.