Best Tips for Face Wash in Telugu: ముఖం ఎప్పుడూ ఫ్రెష్‌గా, మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇందులో భాగంగా అందరూ తరచూ చేసే పని ఫేస్ వాష్ చేసుకోవడం. కొద్దిమంది సహజ పద్ధతులు ఫాలో అయితే.. మరికొద్దిమంది ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. అయితే.. చర్మ సంరక్షణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే.. మనకు తెలియకుండా చేసే కొన్ని పొరబాట్లు చిక్కుల్ని తెచ్చిపెడతాయంటున్నారు. కాబట్టి ఫేస్ క్లీనింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దని అంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
- మేకప్ తొలగించడానికి చాలా మంది క్లెన్సర్స్ వాడుతుంటారు. కానీ దాంతో వాటర్‌ప్రూఫ్ మేకప్ సులభంగా వదలదని.. దాని తాలూకు అవశేషాలు చర్మంపై పేరుకునే ఉంటాయని.. అందుకే క్లెన్సర్‌తో శుభ్రం చేయడానికంటే ముందు ఆయిల్ బేస్డ్ మేకప్ రిమూవర్లను వాడాలని సూచిస్తున్నారు. ఒకవేళ మేకప్ రిమూవింగ్ వైప్‌లు వాడితే మాత్రం ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం తప్పనిసరిగా కడగాలని చెబుతున్నారు.
- ముఖం కడగడానికి చాలా మంది ఫేస్‌వాష్ వాడితే.. మరికొద్దిమంది సబ్బులను వాడుతుంటారు. ఫేస్‌వాష్ వాడితే ఇబ్బంది లేదు కానీ సబ్బుల్ని మాత్రం నేరుగా ముఖం మీద రుద్దకూడదంటున్నారు. ముందు చేతులపై రుద్ది ఆ నురుగునే ముఖానికి రాసి.. అది కూడా సున్నితంగా మర్దన చేయాలని చెబుతున్నారు.
- చాలా మంది ఒకటే టవల్‌ను జుట్టు, శరీరం తుడవడానికి ఉపయోగిస్తారు. అయితే ఇలా ఒకే తువ్వాలను ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదంటున్నారు. ఇలా వాడటం వల్ల తలలో ఉండే జిడ్డూ, చుండ్రు లాంటివి మిగతా శరీర భాగాలకీ అతుక్కుంటాయని.. దానివల్ల ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం కూడా ఎక్కువే అంటున్నారు. కాబట్టి వేరువేరు టవల్స్ వాడాలాని సూచిస్తున్నారు.
- కొంతమంది చర్మం ఆరోగ్యంగా ఉండాలనీ మృతకణాలు తొలగించేందుకు రోజూ స్క్రబ్‌ని వాడుతుంటారు. దీనివల్ల మంచి జరగకపోగా చర్మంపై దద్దుర్లు రావొచ్చని.. చర్మం గరుకుగా మారొచ్చని అంటున్నారు. అందుకే, వారానికి ఒకట్రెండుసార్ల కన్నా ఎక్కువ స్క్రబింగ్ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
- ఫేషియల్ చేయించుకున్నా, దుకాణాల్లో దొరికే పీల్‌ఆఫ్ మాస్కులు వాడినా.. ఆ తరవాత ఆరు గంటల వరకూ సబ్బుతో ముఖం శుభ్రపరచుకోకూడదంటున్నారు. అయితే.. మాస్క్ వేసుకునే ముందు ముఖం కడుక్కోవడం మాత్రం తప్పనిసరి అని చెబుతున్నారు. అంతేకాదు, ఫేస్ వాష్ చేసిన ప్రతిసారీ సబ్బుని వాడాల్సిన అవసరం లేదని.. చల్లటి నీళ్లతో కడిగితే చాలని చెబుతున్నారు.
- చాలా మంది ఫేస్‌ను వేడి నీళ్లతో కడుగుతుంటారు. అయితే ముఖాన్ని చాలా వేడి లేదా చాలా చల్లటి నీటితో కడుక్కోవడం మంచిదని కాదని.. దీని వల్ల చర్మం పొడిబారుతుందని అంటున్నారు. కాబట్టి ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగితే ఫలితం ఉంటుందంటున్నారు. అంతే కాకుండా రోజుకు నాలుగైదు సార్లు మాత్రమే ముఖాన్ని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
అలర్ట్ : తాజా చర్మం కోసమంటూ - పదే పదే ముఖం కడుక్కుంటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?
మీ ఫేస్ మిలమిల మెరిసిపోవాలా? - అయితే నైట్‌టైమ్ ఇలా చేయాల్సిందే!