How to Make Onion Oil Naturally : పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, ఆహార మార్పులు.. వీటి కారణంగా చాలామంది చిన్న వయసులోనే వివిధ రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని దూరం చేసుకునేందుకు మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్ కేర్ ఉత్పత్తులు, నూనెలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఎన్ని షాంపూలు మార్చినా.. ఏ హెయిర్ ఆయిల్ వాడినా.. కొందరికి జుట్టు రాలడం మాత్రం ఆగదు. అదే కాదు చుండ్రు, చిట్లడం వంటి పలు సమస్యలు కూడా తగ్గవు. దీంతో చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడేవారు సహజ సిద్ధంగా ఇంట్లోనే తయారు చేసిన ఉల్లి నూనెను వాడితే ప్రయోజనం ఉంటుందని అంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, ఉల్లి నూనెను ఎలా తయారు చేసుకోవాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- కొబ్బరినూనె- అరకప్పు
- కరివేపాకు - 20 రెబ్బలు
- మెంతులు - టేబుల్ స్పూన్
- ఉల్లిపాయ- 1 (మీడియం సైజ్)
తయారీ విధానం:
- ముందుగా మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి. ఒకవేళ మీడియం సైజ్ లేకపోతే చిన్నవి రెండు తీసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ పొట్టు తీసి సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆన్ చేసిన ఓ మందపాటి పాత్ర పెట్టి అందులో పైన చెప్పిన విధంగా కొబ్బరినూనె, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
- బాగా కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని మీడియం మంట మీద సుమారు అరగంట పాటు మరగించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉల్లి, మెంతులు, కరివేపాకులో ఉన్న పోషకాలన్నీ నూనెలోకి చేరతాయి.
- నూనె మరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారే వరకు పక్కన పెట్టాలి. ఆపై ఒక శుభ్రమైన క్లాత్ సహాయంతో ఆ నూనెను వడకట్టుకోవాలి. అనంతరం దాన్ని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకొని.. కావాల్సినప్పుడు ఉపయోగించుకోవచ్చు.
ఉల్లి నూనె ప్రయోజనాలివే:
- ఈ నూనె తయారీలో ఉపయోగించే కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు కావాల్సిన తేమను అందించి నేచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయంటున్నారు. అలాగే ఇందులోని ప్రొటీన్లు జుట్టుకు పటుత్వాన్ని అందిస్తాయని చెబుతున్నారు.
- కొబ్బరి నూనె.. వాతావరణ కాలుష్య ప్రభావం కురులపై పడకుండా రక్షణ కలిగిస్తుందని.. కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుందని వివరిస్తున్నారు.
- మెంతుల్లో ఉండే ప్రొటీన్, నికోటినిక్ యాసిడ్.. చుండ్రు సమస్యను తగ్గించడంలో బాగా సహాయపడతాయని అంటున్నారు.
- ఇక చివరగా ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉల్లిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. జుట్టు సమస్యలను దూరం చేయడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇవన్నీ జుట్టు రాలడాన్ని అరికట్టి.. హెయిర్ ఒత్తుగా, బలంగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
- 2014లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఉల్లి నూనె జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతుందని, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుందని వెల్లడైంది. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్. అహ్మద్ ఎ. ఖాన్ పాల్గొన్నారు.
గంజిని వృథాగా పారబోస్తున్నారా? - మీ జుట్టుకు ఇలా వాడితే ఎన్నో ప్రయోజనాలట!
చలికాలంలో కుదుళ్లలో దురద ఇబ్బంది పెడుతోందా ? - రోజూ ఇలా చేస్తే అంతా సెట్!