తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అన్ వాంటెడ్ హెయిర్​తో ఇబ్బందా? ఫేస్ వ్యాక్సింగ్ కంటే ఈజీగా నొప్పి లేకుండా క్లీన్! - UNWANTED HAIR REMOVAL TIPS

-అవాంఛిత రోమాల కోసం వ్యాక్సింగ్ చేస్తున్నారా? -ఈ టిప్స్ పాటిస్తే సులభంగా తొలగించుకోవచ్చట!

Unwanted Hair Removal Tips
Unwanted Hair Removal Tips (Getty Images)

By ETV Bharat Lifestyle Team

Published : Jan 25, 2025, 3:12 PM IST

Unwanted Hair Removal Tips:మహిళల అందాన్ని అవాంఛిత రోమాలు దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా పైపెదవి, గడ్డం, కొంతమందికి బుగ్గల పైనా పెరిగి ఇబ్బందిపెడుతుంటాయి. దీంతో ఈ సమస్యను దూరం చేసుకోవడానికి చాలామంది వ్యాక్సింగ్‌ పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. అయితే ముఖంపై వ్యాక్సింగ్‌ చేయడం వల్ల కొందరిలో పలు దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే సహజసిద్ధమైన పద్ధతుల్లోనే ముఖంపై అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడం మేలని సూచిస్తున్నారు. వీటితో నొప్పి తెలియకుండానే అవాంఛిత రోమాల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఎక్కువని వివరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • సహజ పద్ధతిలో అవాంఛిత రోమాలు తొలగించడంలో చక్కెర, నిమ్మరసం ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. 2019లో Journal of Clinical and Aesthetic Dermatologyలో ప్రచురితమైన "The use of sugar and lemon juice as a pre-waxing treatment" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ఇందుకోసం రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసానికి.. పది టేబుల్‌స్పూన్ల నీళ్లు చేర్చుకోవాలి. ఇప్పుడు ఇది కాస్త చిక్కపడే దాకా మరిగించుకొని చల్లార్చుకోవాలని చెబుతున్నారు. సమస్య ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొని.. అరగంటయ్యాక గుండ్రంగా రుద్దుతూ తొలగించుకోవాలని సూచిస్తున్నారు.
  • ఇంకా రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసం తీసుకొని దానికి టేబుల్‌స్పూన్‌ తేనె కలపాలి. ఆ తర్వాత దీన్ని ఐదు నిమిషాల పాటు వేడి చేసి చిక్కగా చేసుకోవాలి. ముందు వెంట్రుకలు ఉన్న చోట కార్న్‌స్టార్చ్‌ అప్లై చేసుకొని.. ఆ తర్వాత చల్లారిన చక్కెర మిశ్రమాన్ని వెంట్రుకలు మొలిచే దిశలో పెట్టుకోవాలని అంటున్నారు. అనంతరం అరగంటయ్యాక ఒక కాటన్‌ క్లాత్‌ సహాయంతో గుండ్రంగా రుద్దుతూ తొలగించుకోవాలని సూచిస్తున్నారు.
  • ఇంకా బాగా పండిన అరటిపండును రెండు టేబుల్‌స్పూన్ల ఓట్‌మీల్‌తో కలిపి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసి.. 15 నిమిషాల పాటు మర్దన చేయాలని సూచిస్తున్నారు. ఆపై చల్లటి నీటితో ముఖం కడిగేసుకుంటే సరిపోతుందని అంటున్నారు.
  • దీంతో పాటు టేబుల్‌స్పూన్‌ చొప్పున తేనె, నిమ్మరసం తీసుకొని.. దానికి ఐదు టేబుల్‌స్పూన్ల బంగాళాదుంప రసం కలుపుకోవాలని తెలిపారు. మరోవైపు రాత్రంతా నానబెట్టిన శనగపప్పును పేస్ట్‌ చేసుకోవాలని అంటున్నారు. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి సమస్య ఉన్న చోట అప్లై చేసుకోవాలని చెబుతున్నారు. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలని వివరిస్తున్నారు.
  • టేబుల్‌స్పూన్‌ చొప్పున కార్న్‌స్టార్చ్‌, చక్కెర తీసుకొని అందులో గుడ్డులోని తెల్లసొన కలపాలని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసుకొని ఆరనివ్వాలని చెబుతున్నారు. తద్వారా ఇది ఒక పొర మాదిరిగా ఏర్పడ్డాక.. దీన్ని తొలగించుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారు. అయితే ఈ చిట్కాల వల్ల సరైన ఫలితం లేకపోయినా, ఇతర దుష్ప్రభావాలేమైనా ఎదురైనా చర్మ సంబంధిత నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ABOUT THE AUTHOR

...view details