Body Lotion Benefits for Skin:తరచూ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల మన చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అయితే చర్మంలో తేమని నిలిపి ఉంచడానికి మార్కెట్లో దొరికే ఏదో ఒక క్రీమ్/బాడీ లోషన్ రాసుకుంటే సరిపోతుందనుకుంటారు చాలామంది. కానీ వీటిలో కూడా చర్మతత్వానికి సరిపోయే లోషన్లను ఎంచుకోవడం ముఖ్యమని.. అప్పుడే ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాడీ లోషన్లు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాస్త తడిగా ఉన్నప్పుడే
ముఖానికి లేదా చర్మానికి క్రీమ్‌లు, లోషన్లు మొదలైనవి రాసుకునే ముందు చర్మాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే చర్మం కాస్త తడిగా ఉన్నప్పుడే వీటిని రాసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే అది చర్మ గ్రంథుల్లోకి చేరే అవకాశం ఉంటుందని.. తద్వారా చర్మం తేమను కోల్పోకుండా జాగ్రత్తపడచ్చని అంటున్నారు.
స్నానం చేసిన వెంటనే
ముఖ్యంగా క్రీమ్ లేదా బాడీ లోషన్స్ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా స్నానం చేసిన వెంటనే రాసుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే ఆ సమయంలో చర్మ కణాలు తెరుచుకొని ఉంటాయని.. కాబట్టి అప్పుడు క్రీమ్ లేదా లోషన్స్ రాసుకుంటే అది చర్మ గ్రంథుల్లోకి చేరి సులభంగా ఇంకుతుందని వివరిస్తున్నారు. అలాగే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టిన తర్వాత కూడా తప్పకుండా క్రీమ్ లేదా బాడీ లోషన్ రాసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే నీటిలో ఉండే క్లోరిన్ వల్ల చర్మం మరింత పొడిగా మారే ప్రమాదం ఉంటుందని వివరిస్తున్నారు.
చర్మం ఉష్ణోగ్రతను బట్టి
అలాగే చర్మం కాస్త వేడిగా ఉన్నప్పుడే క్రీమ్ లేదా లోషన్స్ రాసుకుంటే అవి చర్మంలోకి సులభంగా ఇంకుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే క్రీమ్ లేదా లోషన్ రాసుకునే ముందు చర్మం చల్లగా అనిపిస్తే గోరువెచ్చని నీళ్లలో ముంచిన టవల్‌తో తుడుచుకొని ఆపై లోషన్‌ను చర్మానికి అప్త్లె చేసుకోవాలని వివరిస్తున్నారు.