Kala Jamun Recipe in Telugu : మనలో చాలా మంది ఇష్టపడే టేస్టీ స్వీట్ రెసిపీ గులాబ్ జామూన్. దీనిని కొన్ని మార్పులతో చేసే మరో రకం స్వీట్ కాలా జామున్. అయితే, చాలా మంది ఎన్ని సార్లు చేసినా.. స్వీటు షాపుల్లో దొరికే టేస్ట్ రాదని అనుకుంటారు. కానీ ఈ పద్ధతి పాటించి చేస్తే అచ్చం స్వీటు షాపుల్లో లాగానే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 200 గ్రాముల పచ్చి కోవా
- 100 గ్రాములు పనీర్ (తురిమినది)
- మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండి
- రెండు కప్పులు పంచదార
- పావు టీ స్పూన్ యాలకుల పొడి
- అర టీ స్పూన్ రోజ్ ఎసెన్స్
- కొద్దిగా కుంకుమపువ్వు
- అర చెక్క నిమ్మరసం
- వేయించడానికి సరిపడా నూనె
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నీళ్లు మరిగించి అందులో పంచదార వేసి పూర్తిగా కరిగించి పక్కకు పెట్టుకోవాలి. (పాకం పైన పేరుకుపోయిన తెట్టను తీసివేయాలి.)
- ఆ తర్వాత ఇందులోనే నిమ్మరసం, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి కలపాలి.(ఇది తీగ పాకంలా కాకుండా చూసుకోవాలి)
- ఇప్పుడు కాలా జామున్ కోసం ఒక గిన్నెలో పచ్చి కోవా, పనీర్ తురుము వేసి ఒకసారి బాగా కలపాలి.
- అనంతరం ఇందులోనే మైదాపిండి వేసి మెత్తటి పిండిముద్ద అయ్యేంత వరకూ బాగా కలపాలి. (పిండి ముద్ద మరీ గట్టిగా, పొడిగా ఉంటే పాలు కలుపుకోవచ్చు)
- ఆ తర్వాత పిండి మిశ్రమంలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని, చిన్న ఉండలుగా లేదా నచ్చిన ఆకారంలో చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఒక కడాయిలో నూనె పోసి మరిగించుకోవాలి.
- అనంతరం మంటను లో ఫ్లేములో ఉంచి పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా వేసుకొని నల్ల రంగులోకి మారేంత వరకూ వేయించుకోవాలి. (హై ఫ్లేమ్‌లో పెడితే రంగు మారినా.. లోపల సరిగ్గా ఉడకవు)
- నల్ల రంగులోకి మారిన తర్వాత నూనెలో నుంచి తీసి ముందుగా చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి. (పంచదారం పాకం వెచ్చగా ఉండేలా చూసుకుంటే టేస్ట్ బాగుంటుంది)
- ఇప్పుడు జామున్లని పాకంలో సుమారు రెండు గంటల పాటు నానపెట్టిన తరువాత సర్వ్ చేసుకోవచ్చు.
నోరూరించే హైదరాబాదీ 'డబుల్ కా మీఠా'- ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా చేసుకోండిలా!
వాలెంటైన్స్ డే స్పెషల్ 'ఎగ్ లెస్ రవ్వ కేక్'- ఇంట్లోనే ఈజీగా చేసి సర్ప్రైజ్ ఇవ్వచ్చు!